కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

Revanth Reddy Said That KCR Formulating Strategies To Make KTR CM - Sakshi

ఇందుకోసమే ఢిల్లీలో కాషాయ పెద్దలతో మంతనాలు 

కాంగ్రెస్‌లోనూ కసబ్‌లు ఉన్నారు 

మీడియాతో ఇష్టాగోష్టిలో రేవంత్‌రెడ్డి

వరంగల్‌: తన కుమారుడు కేటీఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన హుజూరాబాద్‌ వెళుతూ, మధ్యలో హనుమకొండలోని పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు.

ఈటల, హరీశ్‌లు మంచి మిత్రులే కాకుండా వ్యాపార భాగస్వాములని, వారిని విడగొట్టేందుకే ఉప ఎన్నిక బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారని అన్నారు. ఈటల ఉప ఎన్నికలో ఓటమి పాలైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఇక్కడ బీజేపీపై ఆరోపణలు చేయడం ఒక డ్రామా అని, ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌..

సీఎంగా కేటీఆర్‌ను చేసేందుకు కాషాయ అధిష్టానంతో మంతనాలు జరిపారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీలోనూ కసబ్‌లు ఉన్నారని, ఒకరు బయట పడ్డారని, ఇంకా కొందరు పార్టీలోనే ఉన్నారని అన్నారు. అతని హయాంలో జిల్లాకు ఒకరిద్దరు చొప్పున కసబ్‌లను తయారు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top