
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఆరోపణలు నిరాధారమన్న హైకోర్టు
అత్యాచార కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలసి ఉన్నప్పుడు ఒక్కరిపై ఆరోపణలు చేయడం సరికాదని, అవి నిరాధారమైనవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు(మహిళ) గతంలోనూ ఇలా మరొకరిపై ఫిర్యాదు చేయగా, అతనిపై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. 21 ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్‌తో ఉన్నారని అభిప్రాయపడింది. దీనికి పిటిషనర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెబుతూ.. రంజిత్‌పై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
ఫిర్యాదుదారు మేరకు.. ‘2017లో నేను హాస్టల్‌లో ఉండి ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించి.. ఇంటి నుంచి గెంటివేశారు’. ఈ ఫిర్యాదు ఆధారంగా, 2019లో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ట్రయల్‌కోర్టులో చార్జిïÙట్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు.
అన్నీ తెలిసే పిటిషనర్‌తో ఉన్నారు..: పిటిషనర్ తరపు న్యాయవాది వాదన లు వినిపిస్తూ..‘పిటిషనర్ నిర్దోషి. ఫిర్యాదుదారు ఆరోపణలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు. రెండేళ్లు గడిచిన తర్వాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇంత ఆలస్యానికి కారణం చెప్పలేదు. ఫిర్యాదుదారుకు బ్లాక్‌మెయిల్ చేసే అలవాటు ఉంది. కేశవ్‌కుమార్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదులో తేదీలు, సమయం, స్థలం సరిగా వివరించలేదు.
పిటిషనర్‌పై నేరాలు ఆమోదయోగ్యం కాదు.. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలి’అని కోరారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నా యి. అతనిపై ఆరోపణలలో నిజానిజాలు ట్రయల్‌కోర్టు తేలుస్తుంది. పిటిషన్‌ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2019, జనవరి 16న ఇంటి నుంచి గెంటివేశారని చెబుతున్న మహిళ ఫిర్యాదు చేయడానికి 23 వరకు ఎందుకు ఆగాల్సి వచి్చందో పేర్కొనలేదన్నారు.
ఆమెకు ఇలా ఫిర్యాదు చేసే అలవాటు ఉందని గత వివరాలు పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. పిటిషనర్, మహిళ.. ఇద్దరూ మేజర్లు. వారి మధ్య సంబంధం ఏకభిప్రాయంతోనే జరిగినట్టు అవగతమవుతోందని స్పష్టం చేశారు. 21ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్‌తో ఉన్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి పిటిషనర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెప్పారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిటిషనర్‌పై కేసును కొట్టివేస్తున్నామని తీర్పునిచ్చారు.