కారణం ఏదైనా వారే టార్గెట్‌: కిడ్నాప్‌లు.. హత్యలు.. లైంగిక దాడులు  | Ranga Reddy: Children Are Main Target To Kidnappings Murders Molestations | Sakshi
Sakshi News home page

Childrens: కారణం ఏదైనా వారే టార్గెట్‌.. కిడ్నాప్‌లు, హత్యలు, లైంగిక దాడులు 

Nov 23 2021 9:17 AM | Updated on Nov 23 2021 9:22 AM

Ranga Reddy: Children Are Main Target To Kidnappings Murders Molestations - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పహాడీషరీఫ్‌: పాత కక్షలు.. ఆస్తి తగాదాలు.. ఇంట్లో గొడవలు.. ఇలా కారణమేదైనా చిన్నారులు బలవుతున్నారు. తరచూ ఏదో ఒక చోట కిడ్నాప్‌లు.. హత్యలు.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం. దగ్గరి బంధువులు, పక్కిళ్ల వారే ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మత్తులో మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. నగర శివారులో వెలుగుచూస్తున్న ఘటనలు తల్లిదండ్రులను కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా బాబాయి ముసుగులో పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది.  

తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం.. 
ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల వయసు నుంచే చిన్నారులకు స్మార్ట్‌ ఫోన్‌లు ఇస్తూ.. ఇంటర్నెట్‌ మాయా ప్రపంచానికి వారిని బానిసలుగా మారుస్తున్నారు. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను గంటల తరబడి పట్టించుకోని సందర్భాలు నెలకొంటున్నాయి. పిల్లలను ఓ కంట కనిపెట్టాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.   

మత్తుకు చిత్తవుతున్న యువత  
మాదకధ్రవ్యాలకు అలవాటు పడి యువత పెడదోవ పడుతోంది. 15 ఏళ్ల వయసులోనే మద్యం తాగడం.. చెడు స్నేహాలు.. గంజాయి, వైట్నర్‌ లాంటి మత్తుపదార్థాలకు బానిలవుతున్నారు. బర్త్‌డేలు, ఫంక్షన్ల పేరుతో హంగామా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఘాతుకాలకు పాల్పడుతున్నారు.  

మచ్చుకు కొన్ని ఘటనలు 
► 2021 నవంబర్‌ 20న పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీరాం కాలనీలో లక్కీ అనే నాలుగేళ్ల బాలుడిని బాబాయి వీరేశ్‌ దారుణంగా హత్య చేశాడు. 
►2019 మే 8న రాత్రి పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి జల్‌పల్లిలోని వాదే ముస్తఫా బస్తీలో కూల్‌డ్రింక్‌ కోసం వెళ్లిన యాసిన్‌ అనే ఏడేళ్ల బాలు డిపై స్థానికంగా ఉండే యువకుడు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చాడు.    
►2014 సెప్టెంబర్‌ 22న ప్రభాకర్, ఉమారాణిల కుమారుడు కరుణాకర్‌(10)ను మల్లికార్జున్, మోహన్‌ కిడ్నాప్‌ చేసి బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదేరోజు దారుణంగా హత్య చేశారు. అనంతరం రూ.2 లక్షలు కావాలంటూ పది రోజుల పాటు తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెట్టారు.  
►2014 ఏప్రిల్‌ 5న ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు డి.కార్తీక్‌ (10)ను బంధువైన శివకుమర్‌ (22) కిడ్నాప్‌ చేసి రూ.2 లక్షలు డిమాండ్‌ చేశాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం వచ్చేలోపే బాలుడిని షాద్‌నగర్‌లో దారుణంగా బండరాయితో మోది హత్య చేశాడు.  
►2017 జూన్‌ 28న ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ జమీల్‌ ఖాన్‌ కుమారుడు మహ్మద్‌ ఖాన్‌(10)కు ఇంటి పక్కన ఉండే 17 ఏళ్ల యువకుడు చాక్లెట్‌ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. 
►2017 మార్చి 28న నమాజ్‌కని వెళ్లిన బండ్లగూడకు చెందిన మహ్మద్‌ యవరుద్దీన్‌ కుమారుడు రఫి(7)ని పొరుగింట్లో ఉండే మునీర్‌ సోని (20) టీవీలో ప్రసారమయ్యే క్రైం పెట్రోల్‌ సీరియల్‌ను అనుసరించి దారుణంగా హత్య చేశాడు. మా నాన్న ప్లాటు అమ్మాడని.. కోటి రూపాయలు వచ్చాయని చెప్పిన పాపానికి డబ్బుల కోసం ఈ ఉదంతానికి పాల్పడ్డాడు.  
►2010 డిసెంబర్‌లో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి సదరు ఏజెంట్‌ కుమారుడిని కిడ్నాప్‌ చేసి బీచ్‌పల్లి కృష్ణానది వద్ద దారుణంగా హత్య చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement