పతకం మీకే అంకితం: పీవీ సింధు

PV Sindhu dedicating Olympic medal to police department - Sakshi

ఒలింపిక్‌ పతకాన్ని పోలీస్‌ విభాగానికి అంకితమిస్తున్నానన్న పీవీ సింధు

లాక్‌డౌన్‌లోనూ ప్రాక్టీసుకు సహకరించారని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఆ మెడల్‌ను పోలీసు విభాగానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి పీవీ రమణతో కలిసి ఆమె మంగళవారం నగర పోలీసు కమిషనరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం సింధుకు ఘన స్వాగతం పలికింది. నగర పోలీసు విభాగానికి చెందిన అశ్విక దళాలు నిజాం కాలేజీ హాస్టల్‌ వద్ద నుంచి సింధు కారుకు పైలట్‌గా వచ్చాయి. కమిషనరేట్‌ పోర్టుకో వద్ద కొత్వాల్‌ అంజనీకుమార్, అదనపు సీపీలు అనిల్‌కుమార్, షికాగోయల్‌ పుష్పగుచ్ఛం అందించి ఆమెకు స్వాగతం పలికారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో సింధు తన పతకాన్ని ప్రదర్శిస్తూ పోలీసు అధికారులకు ఉద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ తన ప్రాక్టీసు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు అందించిన సహకారం మరువలేనిదని, తాను టోక్యో ఒలింపిక్స్‌లో విజయం సాధించడానికి ఆ ప్రాక్టీస్‌ కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను సాధించిన పతకాన్ని పోలీసు విభాగానికి అంకితమిస్తున్నానని ప్రకటించారు. అకుంఠిత దీక్ష, నిరంతర సాధనతో సింధు సా«ధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కొనియాడారు. ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్‌ సందర్భాల్లో నగర పోలీసులు అందించిన సేవలపై ‘కాప్స్‌ వర్సెస్‌ కోవిడ్‌’, ‘ది సెకండ్‌ వేవ్‌’పేర్లతో రూపొందించిన పుస్తకాలను సింధుకు బహూకరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top