‘కార్పొరేట్‌’కు దీటుగా..

Primary school in Savarkheda village equal to Corporate School - Sakshi

కెరమెరి (ఆసిఫాబాద్‌):  కడెర్ల రంగయ్య.. సావర్‌ఖెడా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2010లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. అదే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా ఉంటున్నారు. పాఠశాలలో చేరినప్పుడు 48 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి చాలా మంది పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. దీంతో ప్రస్తుతం 280 విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు తీసిపోని స్కూల్‌ను తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో చదివిన 70 మంది విద్యార్థులు గురుకులాల్లో, ఆరుగురు చుక్కా రామయ్య ట్రస్ట్‌లో సీట్లు సాధించారు. ప్రొజెక్టర్‌ ద్వారా తరగతులు చెబుతారు. సావర్‌ఖెడాలో ఎఫ్‌ఎం సావర్‌ఖెడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడిలో మైక్‌ పెట్టి రోజూ పాఠాలు బోధిస్తున్నారు.

ఘర్‌ బన్‌గయా విద్యాలయ, ప్రేయర్‌ ఎట్‌ చౌరస్తా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు ఇళ్లల్లోనే విద్యార్థులు నిల్చుని ప్రార్థన చేస్తుంటారు. గ్రామంలో మద్యపాన నిషేధం కోసం రంగయ్య ఒక రోజు నిరాహర దీక్ష చేపట్టి మద్యపాన నిషేధం అమలయ్యేలా చూశారు. డ్రాపౌట్లు తగ్గడంతో బాల్యవివాహాలు తగ్గాయి. రంగయ్య సతీమణి వీణ కూడా గ్రామంలో రెండేళ్ల పాటు విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేశారు. రంగయ్య కూతురు అక్షర అదే పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుకుంది. కుమారుడు అభిరాం ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. డ్రాయింగ్‌ షీట్లపై పాఠాలు రాసి గ్రామంలోని ఇళ్ల గోడలపై అతికించారు రంగయ్య. ఉదయం లేవగానే విద్యార్థులు గోడపై ఉన్న పాఠాలను చదువుకుంటున్నారు. 

మరింత ఉత్సాహం 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, స్నేహితుల సహకారంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. ఈ అవార్డు వారికే అంకితం. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ అవార్డు ఎంతో దోహదపడుతుంది.  
– కడెర్ల రంగయ్య, ప్రధానోపాధ్యాయుడు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top