పోలీసింగ్‌ ఉద్యోగం కాదు.. సమాజసేవ 

Policing Is Not A Job Is A Community Service Says Swati Lakra - Sakshi

షీటీమ్స్, భరోసా ఇన్‌చార్జ్, ఏడీజీ స్వాతిలక్రా 

టీఎస్‌పీఏలో 3వ ఆర్మ్‌డ్‌ మహిళా కానిస్టేబుల్స్‌ ఔట్‌ పరేడ్‌  

సాక్షి, హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌: పోలీసింగ్‌ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి చేసే సేవ అని షీటీమ్స్, భరోసా ఇన్‌చార్జ్, ఏడీజీ స్వాతి లక్రా అన్నారు. హిమాయత్‌సాగర్‌లోని రాజ్‌బహదూర్‌ వెంకటరామరెడ్డి తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)లో బుధవారం 3వ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ మహిళా పోలీస్‌ కానిస్టేబుల్స్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌(పీవోపీ) జరిగింది. 637 మంది కానిస్టేబుళ్లు 9 నెలలుగా ఇక్కడ శిక్షణ పొందారు. వీరి ఔట్‌ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా స్వాతి లక్రా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం, దర్యాప్తు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని తెలిపారు. కోవిడ్‌ కాలంలో రాష్ట్ర పోలీసులు సమాజసేవలో గొప్ప పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పోలీస్‌ విభాగంలో 33 శాతం రిజర్వేషన్‌ అమలు జరుగుతోందన్నారు.

మహిళలు, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళా పోలీసులు మరింత మెరుగ్గా విధులు నిర్వహించేందుకు డీజీపీ తీసుకున్న పలు చర్యలను కేడెట్లకు వివరించారు. టీఎస్‌పీఏ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతిభ చూపిన కామెరి స్నేహ (ఆదిలాబాద్‌), కడాలి హారిక (మేడ్చల్‌), బండారపు మమత(పెద్దపల్లి)కు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఐపీఎస్‌ అధికారులు కె.రమేశ్‌నాయుడు, డాక్టర్‌ బి.నవీన్‌కుమార్, శ్రీబాలాదేవి, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్‌ కారణంగా కేడెట్ల కుటుంబాలను ఈ వేడుకకు ఆహ్వానించలేదు. రాష్ట్రంలోని 28 కాలేజీల్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల ఔట్‌పరేడ్‌ వేడుకలు శుక్రవారం వరకు ఇక్కడ 
జరగనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top