హాస్టన్ గో కార్టింగ్ నిర్వాహ‌కుల అరెస్ట్

Police  Arrested  Hasten Go Karting Management And Sent to Charlapalli  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హాస్టన్ గో కార్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహ‌కులను పోలీసులు  అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం వారిని చర్లపల్లి జైలుకు త‌ర‌లించారు. రెండు రోజుల క్రితం  గో కార్టింగ్‌ రైడింగ్‌ చేస్తూ బీటెక్‌ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హాస్టెన్‌ గో-కార్టింగ్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. దీంతో నిందితుల‌పై  304  ఐపిసి సెక్షన్ తో పాటు, 51 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. (గో కార్టింగ్‌ ప్రమాదంపై కేసు నమోదు)

లాక్‌డౌన్  నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్  జోన్‌కు  కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అయిన‌ప్ప‌టికీ  గతనెల 28న నిబంధనలకు విరుద్ధంగా నిర్వహకులు  హాస్టన్ గో కార్టింగ్‌ను ప్రారంభించారు. గో కార్టింగ్‌ రైడ్‌ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హెల్మెట్‌ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో శ్రీ వర్షిణి కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలు కావ‌డంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే సెల్ఫీ కోసం  శ్రీ వర్షిణి హెల్మెట్‌ తీసే ప్రయత్నం చేయడంతో ఆమె వెంట్రుకలు టైర్‌ వీల్‌లో చిక్కుకున్నాయని,  ఆమె కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిందని హాస్టన్‌ గో కార్టింగ్‌ జోన్‌ నిర్వాహకులు చెప్తున్నారు. (గో కార్టింగ్‌ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top