ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

PM Modi Hyderabad Visit: Telangana CM KCR Suffering From Fever - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ శనివారం చేపట్టిన ఒకరోజు రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్‌ పూర్తి దూరం పాటించారు. ముఖ్యమంత్రి స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమంతోపాటు మోదీ పాల్గొన్న ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు హాజరుకాలేదని సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాల పై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్‌ మోదీ పర్యటనకు దూరంగా ఉండటం వ్యూహాత్మకమేననే చర్చ జరుగుతోంది.

శనివారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశు సంవర్దక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతా ధికారులు స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని వెంట కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నరేంద్రసింగ్‌ తోమర్‌తోపాటు గవర్నర్‌ తమిళిసై ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ప్రొటోకాల్‌ మేరకు ఆహ్వానించారు.

అయితే కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడి వివాహం ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవంలో పాల్గొన్న అనంతరం ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకున్నారు. ప్రధాని వెంట గవర్నర్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లగా త్రిదండి చిన్నజీయర్‌ స్వామి, మై హోం ఎండీ రామేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ముచ్చింతల్‌లో జరిగిన కార్యక్రమంలోనూ రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలెవరూ పాల్గొనలేదు. రాష్ట్ర పర్యటన పూర్తి చేసుకొని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరిన ప్రధానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, మంత్రి తలసాని, ఎంపీ సీఎం రమేశ్‌ వీడ్కోలు పలికారు. 

సంజయ్‌కు ఆత్మీయ పలకరింపు.. ఈటలకు ప్రశంస 
హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఇక్రిశాట్, ముచ్చింతల్‌లలో తనకు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చిన 50–60 మంది రాష్ట్ర నాయకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మోదీకి పరిచయం చేస్తూ ‘‘హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడించారు’’అని పేర్కొన్నారు. దీంతో ఈటల భుజంతట్టి ప్రధాని ప్రశంసించారు. అనంతరం ‘‘సంజయ్‌ బండి జీ... ఎలా ఉన్నారు? ఏమిటి విశేషాలు? అంతా బాగే కదా’’అని ఎంపీ బండి సంజయ్‌ను ప్రధాని నవ్వుతూ పలకరించారు. 

 
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top