లక్ష మంది అనర్హులకు పింఛన్! | Pension for one lakh ineligible people | Sakshi
Sakshi News home page

లక్ష మంది అనర్హులకు పింఛన్!

Jul 5 2026 4:24 AM | Updated on Jul 5 2026 4:24 AM

Pension for one lakh ineligible people

65 వేల మంది మరణించినా వారి పేర్లపై పెన్షన్‌ 

ఆచూకీ తెలియని 30 వేల మంది లబ్ధిదారులు 

రాష్ట్రం వెలుపల 5వేల మంది నివాసం 

లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియలో విస్తుపోయే నిజాలు 

బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న వాటిల్లో అక్రమాలు 

17 లక్షల మంది వివరాల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: లోతైన పరిశీలన జరిపే కొద్దీ అనర్హులకు చేయూత పింఛన్లు అందుతున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వపరంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియలో పెద్దసంఖ్యలో అనర్హుల జాబితా బయటకు వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది చేయూత పెన్షన్‌ దారులుండగా (దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా వివిధ కేటగిరీల వారు), వారిలో దాదాపు 19 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా కోర్‌ బ్యాంకింగ్‌ విధానంలో (సీబీఎస్‌) పెన్షన్‌ జమ అవుతోంది. 

అయితే దీనికి సంబంధించి గతంలో దారిద్య్ర నిర్మూలనాసంస్థ (సెర్ప్‌) నిర్వహించిన పైలట్‌ పరిశీలనలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. దీంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లైవ్‌ అథెంటిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం వరకు సుమారు 17 లక్షల మంది లబ్దిదారుల ధ్రువీకరణ పూర్తికాగా, మరో 2 లక్షల మంది ధ్రువీకరణ మిగిలి ఉంది. ఈ లబ్దిదారుల లైవ్‌ అథెంటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం వేగంగా పూర్తి చేసే దిశలో చర్యలు చేపడుతోంది. 

ఇప్పటికే గుర్తించిన అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా కొత్తగా 2 లక్షల మందికి నూతనంగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన ధ్రువీకరణలో దాదాపు లక్ష మంది దాకా అనర్హులకు పింఛన్లు అందుతున్నట్లుగా గుర్తించారు. దీంతో ప్రభుత్వం నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను మరింతగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

మరణించినా అందుతున్న పెన్షన్లు 
ఇప్పటివరకు నిర్వహించిన ధ్రువీకరణలో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. దాదాపు లక్ష మంది దాకా అనర్హులుగా గుర్తించారు. వారిలో దాదాపు 65 వేల మంది మరణించినప్పటికీ వారి పేర్లపై పింఛన్లు కొనసాగుతున్నట్లు తేలింది. అదేవిధంగా 30 వేల మంది లబ్దిదారుల ఆచూకీ లభించలేదు. నమోదైన మొబైల్‌ నంబర్లకు పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడంతో వారు వాస్తవంగా ఉన్నారా? లేక వారి పేర్లపై ఎవరైనా అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారా? అనే అంశంపై మరింత విచారణ కొనసాగుతోంది. దీంతో పాటు సుమారు 5 వేల మంది రాష్ట్రం వెలుపల నివసిస్తున్నట్లు గుర్తించారు. 

వీరిలో పలువురు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. మరోవైపు సుమారు 700 మంది లైవ్‌ అథెంటిఫికేషన్‌కు సహకరించకుండా, పెన్షన్‌ కొనసాగింపుపై ఆసక్తి చూపడం లేదు. ఇక సాంకేతిక కారణాలతో కొందరి ధ్రువీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు 12 వేల మంది లబ్దిదారుల ఆధార్‌ వివరాల్లో సమస్యలు ఉండగా, మరో 33 వేల మందికి బయోమెట్రిక్‌ ధ్రువీకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. 

వేలిముద్రలు సరిపోలకపోవడం, ఐరిస్‌ స్కాన్‌ నమోదు కాకపోవడం వంటి కారణాలతో వీరి ధ్రువీకరణ పూర్తికాలేదు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా మొత్తం సీబీఎస్‌ పింఛన్‌దారులు 19 లక్షలు కాగా వారిలో 15,50,000 అథెంటికేషన్‌ పూర్తి అయ్యింది. రిమార్క్స్‌ కాప్చర్‌ అయినవారు 1.40 లక్షల మంది ఉన్నారు. కాగా, మరో రెండు లక్షల దాకా అథెంటికేషన్లు పూర్తి చేయాల్సి ఉంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement