కల్తీరాయుళ్లపై పీడీ యాక్టు | PD Act Against Adulterators: Damodara Rajanarasimha | Sakshi
Sakshi News home page

కల్తీరాయుళ్లపై పీడీ యాక్టు

Apr 7 2026 5:40 AM | Updated on Apr 7 2026 11:50 AM

PD Act Against Adulterators: Damodara Rajanarasimha

ఫుడ్‌ సేఫ్టీ వాకథాన్‌లో పాల్గొన్న మంత్రి రాజనర్సింహ, సజ్జనార్, క్రిస్టినా జెడ్‌ చోంగ్తు తదితరులు

‘ఈట్‌ రైట్‌..స్టే హెల్తీ’ వాకథాన్‌లో మంత్రి దామోదర

ఖైరతాబాద్‌/అమీర్‌పేట: ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ ‘ఈట్‌ రైట్‌..స్టే హెల్తీ’అనే నినాదంతో సోమవారం నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన వాకథాన్‌ను వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. జలవిహార్‌ నుంచి ఐమాక్స్‌ పక్కనున్న హెచ్‌ఎండిఏ మైదానం వరకు ఈ వాకథాన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం పెరిగిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల ఫుడ్‌ బిజినెస్‌ సంస్థలు ఉన్నాయన్నారు.

వీటిలో 80శాతం పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని కొంత మంది దుర్వినియోగం చేస్తూ ప్రతీ ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత రెండేళ్లలో 11వేలకుపైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఫుడ్‌ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని, శాస్త్రీయ అధ్యయనం అనంతరం త్వరలోనే కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి ఆహార కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్‌ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ వాకథాన్‌లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు, సీపీ సజ్జనార్, ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందనతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  

కల్తీ ఆహారంతో ఆరోగ్యం దెబ్బతింటుంది  
మనం తీసుకునే ఆహారంలో కల్తీ జరగకుండా చూసుకోవాలని, కల్తీ ఆహారం తీసుకుంటూ వెళ్తే ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర అన్నారు. ప్రజా పాలన ప్రగతి పణాళికలో భాగంగా ఫుడ్‌ సేఫ్టీ ఆధ్వర్యంలో ఆహార భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమీర్‌పేట నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ’ఈట్‌ రైట్‌’మేళాను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కల్తీని నిరోధించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement