Osmania University: 2016కు ముందు పీహెచ్‌డీ అడ్మిషన్లు రద్దు!

Osmania University Phd Admissions Cancelled, Btech Management Quota Admission - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్‌డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్‌డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్‌ను సమర్పించాలని అన్నారు. 

బయోమెట్రిక్‌ లేకుంటే జరిమానా
సాక్షి, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్‌ 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరును జేఎన్‌టీయూ హెచ్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
  
బీటెక్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల గడువు 20 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top