
శిక్షణ ఇవ్వండి.. ఆ సమయంలో బాగా చేస్తే వేతనం ఇవ్వండి
మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే కొలువు ఇవ్వండి
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీలకు జేఎన్‌టీయూహెచ్ లేఖలు
మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా స్కిల్స్ అందించాలని నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: విద్యార్థుల నైపుణ్యానికి మెరుగుపెట్టేందుకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. వర్సిటీ పరిధిలో చదివే విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యేలోగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు ప్రత్యేకంగా లేఖలు రాసినట్టు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అధికారులు ఎంపిక చేశారు. ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ అంశాన్ని కీలకంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అధికారులు తెలిపారు.
ప్రయోజనం లేని పట్టాలు
ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీరింగ్, పోస్టు–గ్రాడ్యుయేట్, డిప్లొమా వంటి సాంకేతిక కోర్సులు చేస్తున్న విద్యార్థుల సంఖ్య 1.55 లక్షల వరకూ ఉంటుంది. వీరిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఏటా లక్ష మంది ఉంటారు. వీరిలో కేవలం 8 శాతం మందే స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతుండగా.. 80 శాతం మంది చిన్నస్థాయి ఉద్యోగం పొందడానికీ కష్టపడాల్సి వస్తోంది.
కోడింగ్ రాకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై సాధికారత లేకపోవడం ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయి. ఇంజనీరింగ్ పూర్తవ్వగానే ఉద్యోగం వెతుక్కోవడానికి ఏడాది కాలం వృధా అవుతోంది. స్కిల్ ఉద్యోగం కోసం మరికొన్ని కోర్సులు చేయాల్సి వస్తోంది. అప్పటికే టెక్నాలజీ మారుతోంది. దీంతో కొలువు కష్టమవుతోంది.
కంపెనీల్లోనే శిక్షణ
విద్యార్థుల నైపుణ్య సామర్థ్యం పెంపునకు ఒక్క అవకాశం ఇవ్వాలని కంపెనీలను జేఎన్‌టీయూహెచ్ కోరుతోంది. వర్సిటీ పంపిన లేఖల్లో ఈ అంశాలను స్పష్టంగా వివరించింది. విద్యార్థులు మెరిట్‌తో ఇంజనీరింగ్‌లో చేరుతున్నారని, ప్రాజెక్టు వర్క్ చేసే శక్తి ఉందని, ఒక్క అవకాశమిస్తే సామర్థ్యం నిరూపించుకుంటారని భరోసా ఇస్తోంది. కొద్దిరోజులు శిక్షణ ఇస్తే కంపెనీలకు మానవ వనరుల కొరత తీరే అవకాశం దొరుకుతుందని స్పష్టం చేస్తోంది. శిక్షణ కాలంలో వారి పని విధానం నచ్చితే ఎంతో కొంత వేతనం ఇవ్వాలని సూచిస్తోంది.
శిక్షణ పూర్తయ్యేలోగా మంచి నైపుణ్యం ప్రదర్శించిన వారికి సంస్థలో ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పింది. తమ ప్రతిపాదనపై కొన్ని కంపెనీలు స్పందిస్తున్నాయని, భవిష్యత్‌లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఐటీ కంపెనీలు మాత్రం ఇంజనీరింగ్ విద్యార్థులను ఇంటర్న్‌షిప్ ప్రామాణికంగా చేర్చుకునేందుకు కొంత వెనుకాడుతున్నాయి. సరైన వ్యక్తిగత షూరిటీ ఇవ్వాలని కోరుతున్నాయి. అన్ని కోణాల్లోనూ వారిని పరిశీలించాకే అవకాశం ఇవ్వగలమని చెబుతున్నాయి.
ఇదో వినూత్న కార్యక్రమం: ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి (వీసీ, జేఎన్‌టీయూహెచ్)
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు బహుళ జాతి సంస్థల సహకారం కోరుతున్నాం. అన్ని కంపెనీలను గుర్తించి లేఖలు రాస్తున్నాం. సంస్థల నుంచీ మంచి స్పందన వస్తోంది. ఇంజనీరింగ్ పూర్తయ్యేలోగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందేందుకు ఇది తోడ్పడుతుంది. ఇందులో విజయవంతమైన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.