
శనివారం గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ వేడుకల్లో త్రివర్ణపతాకంతో మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా. చిత్రంలో వివిధ దేశాల సుందరీమణులు
అట్టహాసంగా ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలు
తమను తాము పరిచయం చేసుకున్న 109 దేశాల కంటెస్టెంట్లు
పాశ్చాత్య సంగీతం.. తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం
గోకులంలో గోపిక వస్త్రధారణతో అలరించిన మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా
సాక్షి, హైదరాబాద్: శనివారం సాయంత్రం.. భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం.. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. కలిసి కవాతు చేశాయి..ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి 109 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకోగా, ఆయా సుందరీమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఒకవైపు పాశ్చాత్య సంగీతం.. మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం.. వెరసి ఓ జుగల్‌బందీగా ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం అలరించింది.
జయ జయహే తెలంగాణ ఆలాపనతో..
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పరిమిత సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. గాయకుడు సంగీత శిక్షకుడు రామాచారి శిష్యులు 50 మంది ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన సంగీత శిక్షణ కేంద్రాల కళాకారిణులు 250 మంది పేరిణి నృత్య రూపాన్ని ప్రదర్శించారు.
‘హంస నడకలతో అందమే సాగెనే... అరవిరిసిన..’ అంటూ ప్రపంచ సుందరి పోటీలకు సరిపోయే గీతాన్ని ఎంచుకున్న తీరు ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా కళాకారిణులు నర్తించి పరవశింపజేశారు. అంత పెద్ద సంఖ్యలో కళాకారిణులు స్టేడియం మొత్తం కలిగి తిరుగుతూ నర్తించటం, మధ్యలో సీతాకోకచిలుక, నక్షత్రం, మిస్ వరల్డ్ లోగో ఆకృతిని ఆవిష్కరించడం అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ నృత్య కార్యక్రమానికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు.
ఖండాల వారీగా నాలుగు బృందాలుగా..
ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా, ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరీమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ ఆధ్వర్యంలో కొమ్ము కోయ బృందం కోయ డప్పు నృత్యం ప్రదర్శించారు. ఆ వెంటనే అమెరికా–కరేబియన్ దేశాలకు చెందిన తొలి సుందరీమణుల బృందం వచ్చింది.
నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీట్‌కు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరీమణి రాగా, చివరగా వెనిజువెలా అందెగత్తె వచ్చింది. అనంతరం గోండు గుస్సాడీ కళాకారులు శ్రీధర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే ఆప్రికా ఖండానికి చెందిన దేశాల సుందరీమణులు వచ్చి పరిచయం చేసుకున్నారు. అంగోలా సుందరీమణి ముందు రాగా, చివరగా జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వచ్చింది.
అనంతరం 14 మంది లంబాడీ డప్పు కళాకారులు స్వప్న, అందె భాస్కర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే యూరప్ ఖండానికి చెందిన దేశాల పోటీదారులు వచ్చి పరిచయం చేసుకున్నారు. చివరగా ఒగ్గు డోలు బృందం కళాకారులు 18 మంది ఒగ్గు రవికుమార్ ఆధ్వర్యంలో కళారూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా హ్యూమన్ పిరమిడ్ ఏర్పాటు చేసి పైకి ఎక్కిన కళాకారుడు జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఆసియా–ఓíÙయానా దేశాల ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు.
మిస్ ఇండియా నందినీ గుప్తా రాగానే మార్మోగిన స్టేడియం..
చివరి బృందంలో భాగంగా మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చినప్పుడు స్డేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా స్టేడియంలోకి వచ్చారు. వేషధారణకు తగ్గట్టు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో రావటం విశేషం. నేపాల్‌కు చెందిన సుందరీమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావటం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకాగా.. థాయిలాండ్ సుందరీమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది. చివరలో వచ్చిన వియత్నాం సుందరి వేగంగా నర్తిస్తూ ఆకట్టుకుంది. ఆ్రస్టేలియా యువతి కౌబాయ్ గెటప్‌లో వచ్చింది.
పోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించిన సీఎం
పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవాలు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహూతులు, పోటీదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అందరూ స్టేడియంలోకి వారివారి జాతీయ జెండాలు చేతపట్టుకుని ఊపుతూ వచ్చారు. చివరగా భారత పతాకాన్ని చేతబూని మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చారు. అప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అంతా ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్ వరల్డ్ గీతాన్ని బృంద గానంగా ఆలపించారు.
– భారత దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చాటిన సైనికులకు వందనం సమరి్పస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించినప్పుడు ‘జైహింద్’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. చివరకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నగర మేయర్ విజయలక్ష్మిమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
గొప్ప నగరంలో ఉన్నందుకు పులకిస్తున్నాం: మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా
‘నమస్తే హైదరాబాద్.. నమస్తే తెలంగాణ. ఈ అద్భుతమైన నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనటం నాకు గర్వంగా ఉంది. ఈ అద్భుత దేశం, గొప్ప సాంస్కృతిక కేంద్రంలో మేము ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే అద్భుత కార్యక్రమంలో ఐక్యతను చాటుతూ పాల్గొంటున్నాం. తెలంగాణ సంప్రదాయాలు, గొప్ప చరిత్ర, అద్భుత ఆతిథ్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మిస్ వరల్డ్ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదు.
ఇది ప్రపంచంలో ఓ మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో సాగుతుంది. విద్య, సాధికారత, సమాజ సేవ ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడం ఇందులో భాగం. 109 దేశాల నుంచి వచ్చిన మహిళలు గొప్ప లక్ష్యంతో ఒక్కటిగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇప్పుడు హైదరాబాద్ సరైన వేదికగా నిలి చింది. ఈ నగరంలో సంప్రదాయం–ఆధునికత ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇక్కడి ఆతిథ్యానికి, ,హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు..’ అని మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా అన్నారు.