One traffic police for 4,293 vehicles in Telangana - Sakshi
Sakshi News home page

4,293 వాహనాలకు ఒకే ట్రాఫిక్ పోలీస్.. సిబ్బంది విషయంలో బాగా వెనకబడిన తెలంగాణ?

Published Wed, May 10 2023 4:04 AM

One traffic police for 4293 vehicles - Sakshi

రాష్ట్రంలోని ట్రాఫిక్‌ విభాగాలను మానవ వనరుల కొరత వేధిస్తోంది. చాలీచాలని  సిబ్బందితో వాహనాల నియంత్రణకు అధికారులు తంటాలు పడుతున్నారు. కొన్నేళ్ల  క్రితం నుంచి పోలీసు పోస్టులకు బదులు హోంగార్డులను వినియోగించుకోవడం మొదలెట్టారు.  కానీ వాటిలోనూ వందల సంఖ్యలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి.

ట్రాఫిక్‌ సిబ్బంది అంశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బాగా వెనకబడి ఉందన్న విమర్శలు ఉన్నాయి.  2022 నాటి ఆర్టీఏ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1,51,13,129 వాహనాలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్‌ పోలీసు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌ అండ్‌ డీ) నివేదిక ప్రకారం అన్ని స్థాయిల్లోని ట్రాఫిక్‌ పోలీసుల సంఖ్య 3,520 మాత్రమే. అంటే రాష్ట్రంలో ప్రతి  4,293 వాహనాల నియంత్రణకు ఒకే ట్రాఫిక్‌ పోలీసు ఉన్నట్టు స్పష్టమవుతోంది.

వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్నా..
రాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2019లో వాహ నాల సంఖ్య 1,33,22,334 కాగా.. 2022 నాటికి 1,51,13,129కి చేరింది. ప్రజా రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేకపోవడంతో ద్విచక్ర వాహ­నాలు, చిన్నకార్లు వంటివాటి కొనుగోళ్లు పెరుగుతు­న్నాయి. ఇలా రోడ్లపై పెరిగిన వాహనాల నియంత్రణపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది.

ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ట్రాఫిక్‌ సిబ్బంది సంఖ్య తక్కువ. ఉన్న సిబ్బందితోనే అధిక సమయం పని చేయిస్తున్న పరిస్థితి. షిఫ్ట్‌లు, వీక్లీ ఆఫ్‌లు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జంక్షన్లలో వేళాపాళా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వాయు, ధ్వని కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. ప్ర స్తుతం ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న చాలా మందికి శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు.

ఇతర పోలీసు విభాగాల మాదిరిగా ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న వారికి డ్యూటీ సమయంలో కొంత విరామం కూడా లభించదు. డ్యూటీలోకి వచ్చింది మొదలు పూర్తయ్యే వరకు నిలబడి, అప్రమత్తంగా ఉండి పనిచేయా­ల్సిందే. రద్దీ వేళల్లో వారి ఇబ్బంది మరీ ఎక్కువ. 

 ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు గత ఐదారేళ్లలో వివిధ రకా లైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. స్పాట్‌ చలాన్లకు బదులు పూర్తిస్థాయిలో ఈ–చలాన్లను అమలు చేస్తూ.. నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్రా«దా­­న్యం ఇచ్చారు. హెచ్‌–ట్రిమ్స్‌ వంటి పథకాలతో సిగ్నల్స్‌ ఉన్న జంక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవన్నీ సి­బ్బంది కొరతతో ఉన్న ట్రాఫిక్‌ విభాగానికి కాస్త ఊరట ఇస్తున్నాయి.

♦ ప్రభుత్వం ఇటీవల వేల సంఖ్యలో పోలీసు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అందులో సింహభాగం హైదరా­బాద్‌కు వస్తారని, అవసరమైన సంఖ్యలో ట్రాఫిక్‌ వింగ్‌కు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రోత్సాహకంతో పరిస్థితి మెరుగైంది
గతంతో పోలిస్తే ట్రాఫిక్‌ విభాగంలో సి­బ్బంది పరిస్థితి చాలా మెరుగైంది. అప్ప­ట్లో ఈ విభాగాన్ని అప్రాధా­న్యమై­నదిగా భావించే వారు.  కానీ ట్రాఫిక్‌ వింగ్‌లో పనిచేస్తున్న వారికి 30 శాతం పొల్యూ­షన్‌ అలవెన్స్‌ మంజూరు చేయడంతో పరిస్థితి మారింది. పోస్టింగ్స్‌ కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం జరుగుతు­న్న రిక్రూట్‌మెంట్‌ నుంచి ట్రాఫిక్‌ విభాగానికి గణనీయంగా సిబ్బందిని కేటాయిస్తే ఈ సమస్య తీరుతుంది.    – ఆర్‌వీ నరహరి, ట్రాఫిక్‌ విభాగం మాజీ అధికారి

Advertisement
Advertisement