శభాష్‌.. తెలంగాణ పోలీస్‌! 

Odisha DGP Abhay Appreciates Hyderabad Task Force Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతికంగా ఎంతో ముందున్న హైదరాబాద్‌ పోలీసులు కేవలం ఇక్కడి కేసుల్నే కాదు..దేశంలోని ఇతర రాష్ట్రాలో నమోదైన వాటినీ కొలిక్కి తేవడంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని కొత్వాల్‌ అంజనీకుమార్‌ సోమవారం వెల్లడించారు. ఒడిశాలోని కటక్‌లో ఉన్న ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థలో జరిగిన 12 కేజీల బంగారం దోపిడీ కేసు పరిష్కారంలో తమకు సహకరించాలని ఆ రాష్ట్ర డీజీపీ తనను కోరారని, వెంటనే స్పందించి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను పంపానని ఆయన తెలిపారు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ ఈ విషయాలు తెలిపారు. ఒడిశాలోని కటక్‌లో ఉన్న నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థలో గత నెల 19న భారీ బందిపోటు దొంగతనం జరిగింది. పట్టపగలు ఈ సంస్థపై దాడి చేసిన దుండగులు మారణాయుధాలతో బెదిరించి 12 కేజీల బంగారం ఎత్తుకుపోయారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముష్కరులు కొన్ని నిమిషాల్లోనే ఈ పని చేశారు. ఉదంతం జరిగిన 24 గంటలకూ కటక్‌ పోలీసులు కనీసం ఒక్క ఆధారమూ సేకరించలేకపోయారు. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు

దీంతో ఒడిశా డీజీపీ అభయ్‌ హైదరాబాద్‌ కొత్వాల్‌ అంజనీకుమార్‌ను సంప్రదించారు. సవాల్‌గా మారిన ఐఐఎఫ్‌ఎల్‌ కేసు దర్యాప్తులో కటక్‌ పోలీసులకు సహకరించాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన కొత్వాల్‌ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును ఆదేశించారు. ఆయన అనేక సంచలనాత్మక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో అనుభవం ఉన్న నార్త్‌జోన్‌ టాస్క్‌  ఫోర్స్‌ బృందానికి చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీకాంత్, కానిస్టేబుల్‌ ఈశ్వర్‌లను హుటాహుటిన కటక్‌ పంపారు. అక్కడకు వెళ్లిన ఈ ద్వయం వివిధ సీసీ కెమెరాలను అధ్యయనం చేసి, సాంకేతిక ఆధారాలను పరిశీలించి అనుమానితుల్ని గుర్తించారు. వీరిచ్చిన ఆధారాలతో ముందుకు వెళ్లిన కటక్‌ పోలీసులు గత నెల 24న ఏడుగురిని అరెస్టు చేశారు. కీలక కేసును కొలిక్కి తేవడంతో సహకరించిన హైదరాబాద్‌ పోలీసుల్ని ఒడిశా డీజీపీ అభయ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top