Hyderabad: హౌసింగ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం!

Occupiers Encroached Valuable lands KPHB Colony - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్‌బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. 

►కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి హఫీజ్‌పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్‌ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్‌బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్‌పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్‌పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్‌ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్‌బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్‌ఫొటో)

►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్‌బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. 

►కూకట్‌పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్‌బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది.  

ఉన్నతాధికారుల దృష్టికి.. 
హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి.      
–కిరణ్‌బాబు, హౌసింగ్‌బోర్డు వెస్ట్రన్‌ డివిజన్‌ ఈఈ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top