
సాక్షి, బంజారాహిల్స్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పనిచేసే ఉద్యోగిపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు ఉద్యోగిపై అక్కడి మాజీ ఉద్యోగి తన స్నేహితుడితో కలిసి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలోని టీడీపీ కార్యాలయంలో బొడ్డుపల్లి ప్రశాంత్ వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అదే కార్యాలయంలో ప్రవీణ్ అనే వ్యక్తి పనిచేసేవాడు. అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అక్కడి వెళ్లిపోయిన తర్వాత ప్రవీణ్ తనతో పాటు పనిచేసిన ఓ యువతి ఫోన్ నెంబర్ తన స్నేహితుడు శశికిరణ్‌కు ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా శశికిరణ్ సదరు యువతికి మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నాడు. ఈ విషయం ఆమె.. ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం అతను శశికిరణ్‌కు ఫోన్ చేసి అతడిని నిలదీశాడు. ఇకపై ఆమెకు ఫోన్ చేయవద్దని హెచ్చరించాడు.
దీంతో కక్ష పెంచుకున్న శశికిరణ్ తన స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి అదే రోజు రాత్రి మాట్లాడదామని ప్రశాంత్‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్క గల్లీలోకి పిలిపించాడు. ప్రశాంత్ అక్కడికి రావడంతోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో శశికిరణ్, ప్రవీణ్ అతడిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడమేగాక చంపేస్తామంటూ బెదిరించారు. తీవ్రంగా గాయపడిన అతను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.