దూరమైనా వెళ్లాలి..అభివృద్ధిని దరిచేర్చాలి

No Paddy Procurement In Yasangi Says Cm Kcr  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలకూ ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాల్లో పాలన అందరికీ అందాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని సీఎం గుర్తుచేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల పునర్విభజన జరపాలని, నాలుగైదు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నూతన జోనల్‌ వ్యవస్థతో స్థానిక యువతకే 95 శాతం ఉద్యోగ కల్పన లభించడంతోపాటు క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ పాలన అమల్లోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల విభజనతోపాటు ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 

రైతులకు అర్థమయ్యేలా వివరించండి... 
యాసంగి వరి ధాన్యం కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. బాధకరమే అయినా కేంద్రం మొండి వైఖరితో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే బాధ్యత కలెక్టర్లు, అధికారులకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థం చేయించాలన్నారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఎఫ్‌సీఐ నిర్లక్ష్యంతోనే గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని చెప్పారు. అయితే ఎన్ని కష్టాలొచ్చినా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా వీటిని అమలు చేయలేదన్నారు.  

సామాజిక పెట్టుబడిగా దళితబంధు.. 
తరతరాలుగా వివక్షకు గురైన దళితుల ఆర్థికాభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకం కేవలం వారినే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సైతం పటిష్టపరిచి సామాజిక పెట్టుబడిగా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నాలుగు దిక్కుల్లోని నాలుగు మండలాల్లో సంతృప్తికర స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇందుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. హామీ మేరకు అన్ని నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు. దళితుల ఆర్థిక స్థితి మెరుగుదలకు ఉన్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని అన్ని రకాల వ్యాపార, ఉపాధి మార్గాలను కలెక్టర్లు శోధించాలని సూచించారు. ఈ విషయంలో దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న దళిత మేధావులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు తీసుకోవాలన్నారు.  

ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు... 
కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో ఆందోళన అక్కరలేదని, వైరస్‌ కట్టడికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్‌ పురోగతిని కలెక్టర్లు, వైద్యారోగ్య అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలియజేశారు. 
 
వానాకాలానికి ప్రణాళికలు..
 
వచ్చే వానాకాలంలో ఏయే పంటలు వేయాలో ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకోవాలి. ప్రధానంగా పత్తి, కంది, వరి సాగుపై దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా రైతాంగాన్ని సమాయత్తం చేయాలి. 
 
భార్యాభర్తలకు ఒకేచోట పని... 
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారికి ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలి. అప్పుడే వారు ప్రశాంతంగా పనిచేయగలరు. ఉత్పాదకత సైతం పెరుగుతుంది. స్థానిక యువత ఉద్యోగావకాశాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌజ్‌ కేసులను పరిష్కరించాలి.  

దళితులకు భరోసా కల్పించాలి.. 
గత పాలకుల దశాబ్దాల చేదు అనుభవాలతో ఎప్పుడూ మోసానికి గురవుతూ ఉంటామనే దుఃఖం దళితుల్లో ఉంది. వారి ఆర్తిని అర్థం చేసుకొని భరోసా కల్పించాలి. మీకు (కలెక్టర్లకు) ఆకాశమే హద్దు.ఇప్పటివరకు మీకు ఏ పనిలో లభించని తృప్తి దళితబంధులో దొరుకుతుంది.  

రైతాంగాన్ని కాపాడే బాధ్యత మీదే.. 
కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే బాధ్యత కలెక్టర్లు, అధికారులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్నిరైతులకు అర్థమయ్యేలా వివరించాలి. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలి. యాసంగి కోసం రైతుబంధు సాయాన్ని ఈ నెల 28 నుంచి జమ చేస్తాం. వారం, పది రోజుల్లో వరుస క్రమంలో అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top