బడి బాగు 'బోధనలోనే ల్యాగు' | NITI Aayog report on conditions in Telangana Govt schools | Sakshi
Sakshi News home page

బడి బాగు 'బోధనలోనే ల్యాగు'

May 8 2026 1:13 AM | Updated on May 8 2026 1:13 AM

NITI Aayog report on conditions in Telangana Govt schools

2014–15 నుంచి 2024–25 మధ్య రాష్ట్ర పాఠశాలల్లో పరిస్థితులపై నీతి ఆయోగ్‌ నివేదిక

విద్యార్థుల నమోదు, వసతుల పరంగా రాష్ట్రం ముందంజలో..

బోధన, అభ్యసన కార్యక్రమాల్లో లేని పురోగతి.. 

3–5 తరగతుల్లో లెర్నింగ్‌ గ్యాప్స్‌ పెరుగుతున్నట్లు ఆందోళన

టీచర్‌ ట్రైనింగ్‌ ఆధునీకరించాలని, ఏఐ ఆధారిత లెర్నింగ్‌ టూల్స్‌ వినియోగాన్ని పెంచాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, వసతులపరంగా జాతీయ స్థాయిలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నప్పటికీ నాణ్యతతో కూడిన విద్యావిధానం ఆశాజనకంగా లేదని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. 2014– 15 నుంచి 2024–25 విద్యాసంవత్సరం మధ్య దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పరిస్థితిపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేపట్టింది. దీని ఆధారంగా ‘స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం ఇన్‌ ఇండియా: టెంపోరల్‌ అనాలసిస్‌ అండ్‌ పాలసీ రోడ్‌మ్యాప్‌ ఫర్‌ క్వాలిటీ ఎడ్యుకేషన్‌’నివేదికను గురువారం విడుదల చేసింది. యూడైస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌), పరక్‌ (పెర్ఫార్మెన్స్‌ అసిస్‌మెంట్, రివ్యూ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌), ఎన్‌ఏఎస్‌ (నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే), ఎసర్‌(యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌) నివేదికలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 

వసతుల్లో మెరుగే కానీ... 
నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులున్నాయి. స్కూళ్లలో విద్యుత్‌ వసతి, కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ల విస్తరణ గణనీయంగా పెరిగింది. అలాగే విద్యార్థుల నమోదు రికార్డు స్థాయిలో ఉంది. 2014–15 విద్యాసంవత్సరంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి పాఠశాలల వరకు విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 87.93 శాతం ఉండగా 2024–25 నాటికి అది 111.6 శాతానికి చేరింది. అలాగే మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల నమోదు 76.7 శాతం నుంచి 99.9 శాతానికి పెరిగింది. దేశంలోనే అత్యధిక మాధ్యమిక నమోదుగల రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ప్రధానంగా 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు తగినన్ని ఉండటంతో విద్యార్థులు వాటిపైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో విద్యార్థుల నమోదు సంతృప్తికరంగా ఉందని నీతి అయోగ్‌ అభిప్రాయపడింది. 

కానీ బోధన, అభ్యసన కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా పురోగతి లేదని పేర్కొంది. ప్రధానంగా బోధనలో నాణ్యత లోపించడం, గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులు అత్యంత వెనుకబడి ఉండటం, ప్రాథమిక అభ్యసన, అవగాహన తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం 9వ తరగతి పరీక్షల్లో విద్యార్థుల గణితం, సైన్స్‌ ఫలితాలు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి. లాంగ్వెజెస్‌లో జాతీయ సగటుతో సమానంగా ఉన్నప్పటికీ గణితం, సైన్స్, సోషల్‌లో రాష్ట్రం వెనుకబడి ఉంది. ‘నాస్‌’2017–21 గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అభ్యసన క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. 5వ తరగతిలో లాంగ్వెజెస్, గణితం, ఈవీఎస్‌ సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభ పతన స్థాయిలో ఉంది. 8వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో మార్కులు భారీగా తగ్గాయి. కరోనా తర్వాత పాఠశాలలు, విద్యార్థుల తీరు ఇంకా కోలుకోలేదని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి ఫౌండేషనల్‌ లిటరసీ నుంచి కాన్సెప్ట్యువల్‌ లెర్నింగ్‌కి మారే దశలో లెర్నింగ్‌ గ్యాప్స్‌ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
 

ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లుతుండటంతో.. 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో నిర్మాణాత్మక సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2,245 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరని.. అయినప్పటికీ వాటిలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించింది. 5,001 సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలో 62 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా మార్పులు, ప్రైవేటు పాఠశాలల వైపు తల్లిదండ్రుల మొగ్గు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వసనీయత లోపిస్తుండటం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక విశ్లేషించింది. రాష్ట్రంలో మొత్తం 43,154 పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిలో అధిక సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలే ఉండటం మరో ప్రధాన సమస్య అని నీతి ఆయోగ్‌ గుర్తించింది. కేవలం 974 పాఠశాలలే 1 నుంచి 12 వరకు ఇంటిగ్రేటెడ్‌/కాంపోజిట్‌ స్కూల్స్‌గా ఉన్నాయని తెలిపింది. దీనివల్ల విద్యార్థులు తరచూ స్కూళ్లు మారాల్సి వస్తోందని.. ఇది భవిష్యత్తులో డ్రాపౌట్లకు దారితీసే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని హెచ్చరించింది.  

బాలికల విద్యలో ముందంజ 
నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. ఆడపిల్లల చదువుల విషయంలో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. 2024–25 విద్యాసంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో బాలికల జీఈఆర్‌ జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ 115.6 శాతంగా నమోదైంది. ప్రాథమికోన్నత స్థాయిలో బాలికల నమోదు పదేళ్లలో 88.91 శాతం నుంచి 113.4 శాతానికి ఎగబాకింది. సెకండరీ స్థాయిలో 78.58 శాతం నుంచి 101.5 శాతానికి చేరి 100 మార్కును దాటేసింది. హయ్యర్‌ సెకండరీలో బాలికల నమోదు 49.58 శాతం నుంచి 71.3 శాతానికి చేరుకుంది. 

దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లు అంతంతే..  
వీల్‌చైర్‌ తదితర సదుపాయాల కోసం ర్యాంపుల ఏర్పాటులో రాష్ట్రం 28.3 శాతం నుంచి 76.7 శాతానికి ఎగబాకిందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. కానీ దివ్యాంగులకు ప్రత్యేకంగా వినియోగపడే మరుగుదొడ్లు కేవలం 6.8 శాతం బడుల్లోనే ఉన్నాయని తెలిపింది. అయితే పదేళ్ల కిందట ఇది 2.7 శాతంగా ఉండేదని వివరించింది. 

రాష్ట్రానికి నీతి ఆయోగ్‌ కీలక సిఫార్సులు.. 
– భవిష్యత్తులో తెలంగాణ విద్యావ్యవస్థ రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ దిశగా ముందుకు సాగాలి. 
– ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీపై మరింత దృష్టి పెట్టాలి. 
– కాంపిటెన్సీ బేస్డ్‌ లెర్నింగ్‌ అమలు చేయాలి. 
– టీచర్‌ ట్రైనింగ్‌ను ఆధునీకరించాలి. 
– ఏఐ ఆధారిత లెర్నింగ్‌ టూల్స్‌ వినియోగాన్ని పెంచాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement