ఇటు అభివృద్ధి .. అటు పేదరికం! 

NITI Aayog Multidimensional Poverty Index 2023 Revealed - Sakshi

ఒకవైపు గణనీయమైన అభివృద్ధి, అపార అవకాశాలు ఉన్న నగరాలు, గ్రామాలు 

పౌష్టికాహారం, నడిచేందుకు రోడ్డు,  ఉండేందుకు ఇళ్లులేని పేద ప్రాంతాలు మరోవైపు 

తెలంగాణలో గడిచిన ఏడేళ్లతో పోలిస్తే  7.3 శాతం తగ్గిన పేదరికం 

అదే సమయంలో పేదరికంలో దేశ సగటును మించిన కొమురంభీం, జోగుళాంబ జిల్లాలు  

నీతి ఆయోగ్‌ బహుముఖ పేదరిక సూచి–2023 వెల్లడి 

ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికలు అవసరమంటున్న నిపుణులు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒక రాష్ట్రం అభివృద్ధికి.. ఒక నగరం. కొన్ని పట్టణాలు, పలు గ్రామాలే కొలబద్ద కాదు. ఏ మూలకు వెళ్లినా కాస్త అటుఇటుగానైనా అభివృద్ధి, ఒకే జీవన విధానం, సమాన అవకాశాలు ఉండాలి. అలా ఉండేలా చూడటం ప్రభుత్వాల విధి. కానీ గణనీయమైన అభివృద్ధి, అపార అవకాశాలు ఉన్న నగరాలు, గ్రామాలు ఒక వైపు.. అసలు తినేందుకు పౌష్టికాహారం, నడిచేందుకు రోడ్డు, ఉండేందుకు ఇళ్లులేని పేద ప్రాంతాలు మరోవైపు ఉంటే ప్రగతి గతి సరిగా లేదనే చెప్పాలి. తెలంగాణలో ఇదే విధమైన పరిస్థితి ఉంది.

ఇటీవల నీతిఆయోగ్‌ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి–2023.. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదరికం 7.3 శాతం తగ్గిందని వెల్లడించింది. 2015–16లో రాష్ట్రంలో 13.18 శాతం పేదలుండగా 2019 –21కి వచ్చే సరికి 5.88 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అయితే కొమురంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మాత్రం జాతీయ సగటు (14.96 శాతం)కు మించి పేదరికం నమోదు అవటం గమనించాల్సిన అంశం.

గడిచిన పదేళ్ల క్రితమే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పైమూడు జిల్లాల్లో అసమగ్ర అభివృద్ధి, సంక్షేమం ఉందని తేలినా.. అక్కడ ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ అమలు చేయని కారణంగా ఇంకా ఆయా జిల్లాలు అత్యధిక పేద జిల్లాలుగానే కొనసాగుతున్నాయి.  

ఇక్కడ అన్నీ సమస్యలే 
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ఆధారంగా నీతిఆయోగ్‌ బాలికా శిశు, బాలింతల ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, విద్యుత్, మంచినీరు, సొంత ఆస్తులు, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర పన్నెండు అంశాలను తీసుకుని తెలంగాణలోని పేదల లెక్కలు తీసింది. అందులో అత్యధికం తినేందుకు పౌష్టికాహారం, ఉండేందుకు సరైన ఇంటి వసతి లేని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తేలింది. అలాగే అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు, వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎక్కువగా ఉండటం శోచనీయం. 

ఆరు కిలోమీటర్లు నడిస్తేనే.. 
కొమురంభీం జిల్లా తిర్యాణి మండలం భీమ్‌రెల్ల గ్రామానికి వెళ్లే దారి ఇది. మండల కేంద్రం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే భీమ్‌రెల్లకు వెళ్లాలంటే ముల్కలమంద పంచాయతీ పరిధిలోని తోయరేటి వరకు వాహనంలో వెళ్లాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు నడిస్తేనే గానీ గ్రామానికి చేరుకోలేం. ఈ గూడెంలో 50 మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు.

బండరాళ్ల దారిలో కాలినడక! 
ఇది కొమురంభీం జిల్లా కెరమెరి మండలం లైన్‌పటార్‌ గ్రామానికి వెళ్లే రోడ్డు. ఈ గ్రామంలో 113 మంది జనాభా ఉన్నారు. దారి మొత్తం బండరాళ్లతో అధ్వానంగా ఉంది. దారి మధ్యలో రెండు ఒర్రెలు కూడా ఉండటంతో వర్షాకాలంలో ఆదివాసీల అవస్థలు వర్ణనాతీతం. పిల్లలు, పెద్దలు ఎవరైనా.. ఇలా ఇబ్బందులు పడాల్సిందే.

అక్షరాస్యతలో అధ్వానం.. గట్టు 
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. మండలంలో 36 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. మండలంలో 60 పాఠశాలలు ఉన్నాయి. కానీ సరైన వసతులు లేవు. టీచర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేందుకు పెద్దగా శ్రద్ధ చూపరు.

సీడ్‌ పత్తి సీజన్‌ (పత్తి మొగ్గ గిల్లేందుకు చిన్నపిల్లలు అవసరం. దీంతో సీజన్‌లో ఎక్కువగా చిన్నపిల్లలను రైతులు పనుల్లో పెట్టుకుంటారు. పిల్లలు బడికి వెళ్లకపోవడానికి ఇదో ప్రధాన కారణం. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రమే. ఈ కారణంగా గట్టు మండలం పూర్తిగా వెనుకబడి ఉంది. 

ప్రత్యేక కార్యాచరణ అవసరం 
పేదరికం, వెనుకబాటుపై ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్నా.. వెనుకబడిన ప్రాంతాలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.  – ప్రొఫెసర్‌ కె.ముత్యంరెడ్డి, తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ 

సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు లేవు  
వెనుకబాటు, అసమానతల వల్లే తెలంగాణ నినాదం పుట్టింది. ఈ రెండింటినీ లేకుండా చేయటం కోసమే తెలంగాణ ఏర్పడింది. కానీ గడిచిన పదేళ్లలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రణాళికలు, రాజకీయ నిర్దేశనం లేకపోవటం వల్లే అభివృద్ధిలో అసమానతలు నెలకొన్నాయి.     – గాదె ఇన్నయ్య, సామాజిక విశ్లేషకుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top