రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు
రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే దిగువకు... ఆందోళన కలిగిస్తున్నఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6 గణాంకాలు
రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7కు పతనం
జాతీయ సగటు 1.9 కంటే తెలంగాణలో తక్కువ నమోదు
భవిష్యత్‌లో వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరతకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిళ్ల ఆలస్యం.. పిల్లలను కనే విషయంలో ఆసక్తి చూపకపోవడం లేదా ఒకరితోనే సరిపెట్టుకోవాలనే ఆలోచనలు పెరుగుతుండడం వంటి కారణాలు రాష్ట్ర జనాభాపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జపాన్, దక్షిణకొరియా, ఇటలీ, చైనా వంటి దేశాల తరహాలో భవిష్యత్‌లో యువశక్తి క్షీణించి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశముందని తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్‌సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)–6 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023– 24లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6) ఫ్యాక్ట్ షీట్లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత మే 29న విడుదల చేసింది. దేశంలోని 715 జిల్లాల్లో సుమారు 6.79 లక్షల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 1.7కు చేరడం, రీప్లేస్‌మెంట్ స్థాయి 2.1 కంటే గణనీయంగా తగ్గి, జాతీయ సగటు కన్నా క్షీణిస్తుండడం భవిష్యత్‌లో యువశక్తి తగ్గి, వృద్ధ జనాభా పెరుగుదలకు సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దిగువకు చేరిన జననాల రేటు
ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచికే టీఎఫ్‌ఆర్. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఈ రేటు 2.1 ఉండాలి. దీనినే రీప్లేస్‌మెంట్ స్థాయి అంటారు. కానీ తెలంగాణలో ఈ స్థాయి చాలాకాలంగా అందుబాటులో లేదు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–3 (2005–06)లో 1.8గా ఉన్న టీఎఫ్‌ఆర్ ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ –4, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5లో కూడా అదే స్థాయిలో కొనసాగగా, తాజా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6లో 1.7 స్థాయికి తగ్గింది. అంటే ప్రతితరం తన స్థానంలో వచ్చే తరాన్ని పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితి క్రమంగా ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్ సవాళ్లకు నాంది
ప్రస్తుతం తెలంగాణలో పనిచేసే వయసు జనాభా అధికంగా ఉండటంతో రాష్ట్రానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ లభిస్తోంది. అయితే జననాల రేటు దీర్ఘకాలంగా తక్కువగానే కొనసాగితే ఉద్యోగ, కార్మిక రంగంలోకి వచ్చే యువత సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది. అదే సమయంలో మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీంతో భవిష్యత్‌లో పెన్షన్లు, ఆరోగ్య సేవలు, వృద్ధుల సంరక్షణపై ప్రభుత్వ వ్యయం పెరిగే అవకాశం ఉంది. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వృద్ధ జనాభా సమస్యలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
దక్షిణాది ధోరణిలోనే తెలంగాణ
దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలోనూ సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే దిగువనే ఉంది. తెలంగాణ టీఎఫ్‌ఆర్ 1.7గా ఉండగా, ఏపీలో కూడా ఇదే స్థాయిలో నమోదైంది. కేరళ (1.5), తమిళనాడు (1.6), కర్ణాటక (1.6) రాష్ట్రాల్లో జననాల రేటు మరింత తక్కువగా ఉంది.


