
విద్యుత్‌షాక్‌తో నవవరుడి మృతి
రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం
కోడిపుంజులతండాలో ఘటన
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.
మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..
రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్‌ను మోటార్ ఆన్‌చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్‌తీగలను సాకెట్‌లో పెడుతుండగా షాక్‌గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్‌రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
చనిపోయే ముందు ఉప్మా అందించాడు..
రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు.