స్క్రాప్‌గా మార్చి.. కొత్త ఆటోలు తెచ్చి..!

New Autos On Old Permit Soon: Transport Department - Sakshi

పాత పర్మిట్‌పై కొత్త ఆటోలు తెచ్చే విధానం త్వరలో అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో కాలంచెల్లిన ఆటోరిక్షాలను స్క్రాప్‌గా మార్చి ఆ పర్మిట్లపై కొత్త ఆటోలను తీసుకొనే విధానంపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తేసేందుకు రవాణా­శాఖ సిద్ధమైంది. పాత పర్మిట్లపై కొత్త ఆటోలు పొందే విషయంలో భారీ అక్రమాలు జరిగాయంటూ గతంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లు­వెత్తడంతో ఆ విధానం అమలును నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్‌లో రవాణాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో మళ్లీ పాత పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్లు మరో ఆదేశాన్ని జారీచేసి దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

వేలల్లో అక్రమాలు...
కాలంచెల్లిన ఆటో రిక్షాలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్ల ఆధారంగా కొత్త ఆటోలు తీసుకొనే పద్ధతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాన్ని తీసుకోకపోవడాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు బ్రోకర్లు, రవాణా శాఖ అధికా­రుల అండదండలతో భారీ అక్రమాలకు తెరలే­పారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజానికి తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఛాసిస్‌ను మూడు ముక్కలు చేయాల్సి ఉంటుంది.

కానీ దాన్ని తుక్కుగా మార్చినట్లు రికార్డుల్లో చూపుతూ తక్కువ ధరలకు ఆ ఆటోను మరొకరికి విక్రయించే వారన్నది ఆరోపణ. అటు పాత ఆటో పర్మిట్‌ లేకుండా తిరుగుతుండగా దాని పర్మిట్‌తో మరో కొత్త ఆటో రోడ్డెక్కేదని ఫిర్యాదుల సారాంశం. అలా దాదాపు 8 వేల వరకు ఆటోలు అక్రమంగా తిరుగుతున్నాయంటూ కొన్ని ఆటో సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదుల ఒత్తిడితో అధికారులు ఆ పద్ధతిని నిలిపేశారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్క్రాప్‌ పాలసీని అమలులోకి తెస్తామంటూ అప్పట్లో అధికారులు చెప్పారని యూనియన్‌ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ విధానమంటూ లేకుండానే పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వేల సంఖ్యలో ఆటోరిక్షాలు అక్రమంగా తిరిగేందుకు అవకాశం కల్పించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నారంటూ ఆటోరిక్షా యూనియన్‌ నేత దయానంద్‌ తాజాగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.

అయితే ‘పాత పద్ధతినే పునరుద్ధరి­స్తున్నప్పటికీ తుక్కుగా మార్చిన ఆటోరిక్షా ఫొటోలను తీయాలని, ఆటో ఛాసీస్‌ను మూడు ముక్కలు చేయాలని, ఆ వివరాలు పొందుప­రచాలని నిబంధన లు విధించాము,  వాటిని కచ్చి­తంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశా­ము’ అంటూ ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top