తెలంగాణ, ఏపీ, డిగ్రీ.. ఇవి అభ్యర్థుల పేర్లట!

Names Mistakes In Singareni Junior Assistant Hall Tickets - Sakshi

సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ హాల్‌టికెట్లలో తప్పులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/శ్రీరాంపూర్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎస్సెస్సీ, డిగ్రీ.. ఇవేంటో తెలుసా? ఇటీవల సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ హాల్‌టికెట్లలో అభ్యర్థుల పేర్లు. వినడానికి, చదవడానికి ఇవి నవ్వు పుట్టిస్తున్నా.. ఇది నిజమే. ఇటీవల సెప్టెంబర్‌ 4న జరిగిన సింగ­రేణి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలు ఈ నెల 10న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 98,882 మంది దరఖాస్తు చేసుకోగా 77,898 మంది హాజరయ్యారు.

వీరిలో 49,328 మంది అనర్హులవగా 28,570 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఆదివారం ఫలితాలను గమనించిన అభ్యర్థులు నిర్వహణతీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. హాల్‌టికెట్లపై అక్షరదోషాలకు బదులు అచ్చుతప్పులు ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు.. వి.శ్రీధర్‌ అనే అభ్యర్థి(హాల్‌ టికెట్‌ నంబర్‌ 7709069) పేరు స్థానంలో ‘తెలంగాణ’అని ఉంది. బి.మణికంఠ అనే అభ్యర్థి(హాల్‌ టికెట్‌ నంబర్‌ 2204302) పేరు స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ అని, బి.లలిత అనే అభ్యర్థి(హాల్‌టికెట్‌ నంబర్‌ 2218581) పేరు ‘డిగ్రీ’అని ఉంది.


ఆంధ్రప్రదేశ్‌ అని ప్రచురించిన హాల్‌టికెట్‌ 

మరో అభ్యర్థి(హాల్‌ టికెట్‌ నంబర్‌ 3308978) పేరుకు బదులుగా బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అని రాసి ఉంది. అసలే పరీక్ష నిర్వహణపై ముందు నుంచీ పలు రకాల వదంతులు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హాల్‌టికెట్లలో తప్పులు దొర్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సింగరేణి తీరును ఎండగడుతూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top