సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడగా.. రక్షించేందుకు వెళ్లి అతని తాత మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన..
శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మామిడి చెట్టుకు నీరు పెట్టేందుకు మనువడు, మనవరాలుతో వెంకన్న(50) వెళ్లాడు. మనవడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. అది గమనించిన తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించగా.. బోరు అంచులో ఉన్న మట్టి కుంగిపోయి అదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు.

వెంటనే మనవరాలు స్థానికులను అప్రమత్తం చేసింది. దీంతో తాళ్ల సాయంతో సైదులు అనే యువకుడు లోపలికి దిగి వాళ్లను బయటకు తీశాడు. ఈలోపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అయితే బోరుబావి గుంతలో ఊపిరి ఆడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వెంకన్న కన్నుమూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


