ప్లాస్టిక్‌పై మరో సమరం  

Municipality Has Declared Plastic Carry Bags Are Banned - Sakshi

50 నుంచి 75 మైక్రాన్లకు నిషేధం పొడిగింపు

రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో అమల్లోకి కొత్త నిబంధనలు

నిషేధిత క్యారీ బ్యాగులు అమ్మినా, వాడినా జరిమానా 

వచ్చే ఏడాది జూలై నుంచి 120 మైక్రాన్లకు నిషేధం విస్తరణ 

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వినియోగంపై పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ క్రయవిక్రయాలు, వినియోగంపై గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది.

నిషేధం అమల్లోభాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు గడువులను ప్రకటిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికలు కూడా నోటిఫికేషన్‌ జారీ చేశాయి. ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. గత సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, వచ్చే ఏడాది డిసెంబర్‌ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది.  

టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు 
నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు మున్సిపల్‌ కమిషనర్, హెల్త్‌ ఆఫీసర్, శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అన్ని పురపాలికల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 22 నుంచి వారంపాటు దాడులు జరిపి నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న వారిపై జరిమానా విధించనుంది. 25 నుంచి నెలకోసారి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పెద్ద సముదాయాలపై దాడులు నిర్వహించనుంది. ఆలోగా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. 

ఇక చెత్త వేస్తే జరిమానా 
పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాలను ఈనెల 31 నుంచి చెత్తరహిత ప్రాంతాలుగా పురపాలికలు ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వాణిజ్య ప్రాంతాల్లోని రోడ్లపై చెత్తను పడేసే వారిపై జరిమానా విధించనున్నాయి. రోజుకు 100 కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కూరగాయాల మార్కెట్లు ఇకపై ఆన్‌సైట్‌ కంపోస్టింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది.

లేని పక్షంలో నవంబర్‌ 10 నుంచి జరిమానా విధించనున్నారు. కాలనీలు, వెల్ఫేర్‌ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్లు సైతం విధిగా తడి, పొడి చెత్తను వేరుగా నిర్వహించాలి. ఆన్‌సైట్‌లో కంపోస్టింగ్‌ చేపట్టని పక్షంలో నవంబర్‌ 28 నుంచి వీటిపై సైతం జరిమానా విధించనున్నారు. నవంబర్‌ 28 నుంచి గుర్తించిన కాలనీలను చెత్తరహిత ప్రాంతాలుగా ప్రకటించి, చెత్త పడేసే వారిపై జరిమానా వడ్డించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top