breaking news
N. Satyanarayana
-
ప్లాస్టిక్‌పై మరో సమరం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు, వినియోగంపై గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది. నిషేధం అమల్లోభాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు గడువులను ప్రకటిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికలు కూడా నోటిఫికేషన్ జారీ చేశాయి. ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. గత సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అన్ని పురపాలికల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 22 నుంచి వారంపాటు దాడులు జరిపి నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై జరిమానా విధించనుంది. 25 నుంచి నెలకోసారి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పెద్ద సముదాయాలపై దాడులు నిర్వహించనుంది. ఆలోగా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక చెత్త వేస్తే జరిమానా పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాలను ఈనెల 31 నుంచి చెత్తరహిత ప్రాంతాలుగా పురపాలికలు ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వాణిజ్య ప్రాంతాల్లోని రోడ్లపై చెత్తను పడేసే వారిపై జరిమానా విధించనున్నాయి. రోజుకు 100 కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కూరగాయాల మార్కెట్లు ఇకపై ఆన్సైట్ కంపోస్టింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో నవంబర్ 10 నుంచి జరిమానా విధించనున్నారు. కాలనీలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్లు సైతం విధిగా తడి, పొడి చెత్తను వేరుగా నిర్వహించాలి. ఆన్సైట్లో కంపోస్టింగ్ చేపట్టని పక్షంలో నవంబర్ 28 నుంచి వీటిపై సైతం జరిమానా విధించనున్నారు. నవంబర్ 28 నుంచి గుర్తించిన కాలనీలను చెత్తరహిత ప్రాంతాలుగా ప్రకటించి, చెత్త పడేసే వారిపై జరిమానా వడ్డించనున్నారు. -
స్త్రీ సాధికారత, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
► జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ ► నారీ ఫౌండేషన్ ప్రతినిధులతో సమీక్ష సాక్షి, కామారెడ్డి: స్త్రీ సాధికారత సాధించడంతో పాటు మహిళల ఆరోగ్యం విషయంలో స్వయం సహాయక సంఘాలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి నారీ ఫౌండేషన్ ప్రతినిధులతో స్త్రీ సాధికారత, మహిళల ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సంఘాలు, చిన్న సంఘాల సమావేశాలు, చర్చించుకునే అంశాలపై సమీక్షించారు. జెండర్ కమిటీ సభ్యుల పనితీరుపై చర్చించారు. జిల్లా సమాఖ్య నుంచి చిన్న సంఘాల దాకా సమాచారం ఎలా చేరుస్తారన్న దానిపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీల సాధికారత, వ్యక్తిగత పరిశుభ్రత, భహిష్టు శుభ్రత, నిర్వహణ, బాలికల ఆరోగ్య విషయాలపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, డీఈవో మదన్మోహన్, నారి ఫౌండేషన్ ప్రతినిధి అంజు తదితరులు పాల్గొన్నారు.