నకిలీ వెబ్‌సైట్లు తొలగింపు | Sakshi
Sakshi News home page

నకిలీ వెబ్‌సైట్లు తొలగింపు

Published Mon, May 1 2023 2:16 AM

More than hundred fake websites have been canceled so far - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలకు ప్రధాన వేదిక నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్‌ అప్లికేషన్లే (యాప్స్‌). దీంతో వాటిని కూకటివేళ్లతో సహా తొలగించి తద్వారా సైబర్‌ నేరాలను పెకిలించేందుకు సైబరాబాద్‌ పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సైబరాబాద్‌లోని సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) ద్వారా నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను గుర్తించి, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు సీఓఈ ద్వారా వందకు పైగా ఫేక్‌ సైట్లను తొలగించారు. 

విదేశాల నుంచి కూడా.. 
విదేశాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరాఖండ్, కర్నాటక, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా సైబర్‌ నేరస్తులు నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరస్తులు నకిలీ యాప్‌లను అభివృద్ధి చేసి, ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అవి నకిలీవని తెలియక చాలా మంది కస్టమర్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోతున్నారు. అందుకే పక్కా ఆధారాలతో నకిలీ సైట్లు, యాప్‌లను తయారు చేసే వారిని గుర్తించి, శిక్షలు పడేలా చేస్తున్నారు. 

ప్రతీ స్టేషన్‌లో సైబర్‌ వారియర్లు.. 
ప్రస్తుతం సైబర్‌ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రతి శాంతి భద్రతల ఠాణాలోనూ ఇద్దరు సైబర్‌ వారియర్లు ఉన్నారు. వీరికి ఎస్‌ఐ నేతృత్వం వహిస్తారు. వీరికి సైబర్‌ నేరాల నియంత్రణపై శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టడం కూడా సైబర్‌ నేరస్తులకు అవకాశంగా మారుతోంది.

అవగాహనే సైబర్‌ నేరాలకు నియంత్రణకు ప్రధాన అస్త్రం. అందుకే కమిషనరేట్‌ పరిధిలో నివాసిత సంఘాలు, కంపెనీలు, పరిశ్రమలు, విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలలోనూ సైబర్‌ నేరాలపై షార్ట్‌ వీడియో, పోస్ట్‌లు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు.  

Advertisement
Advertisement