తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు | Sakshi
Sakshi News home page

తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు

Published Wed, Dec 20 2023 2:36 AM

More than 20 percent difference between budget estimates and cost - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ విధ్వంసం–ఆర్థిక అరాచకం’పేరుతో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భాగంగా 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, తద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించనున్నట్లు సమాచారం.

అలాగే 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023–24 బడ్జెట్‌ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, జరిగిన ఖర్చుతో పాటు అప్పుల గురించి శాసనసభకు తెలియజేయనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, రెండింటికీ మధ్య సుమారు 20 శాతం తేడా ఉందంటూ గణాంకాలు వెల్లడించనున్నట్లు తెలిపాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం రూ.14,87,834 కోట్లను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించనుంది. 

అప్పులు ఇలా..!
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75 వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో అది రూ.6,85,765 కోట్లకు చేరింది. అందులో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడి తెచ్చిన అప్పు రూ.3.89 లక్షల కోట్లయితే, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీల ద్వారా ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లకు పైగా సమకూర్చి ఖర్చు పెట్టింది.

మరో రూ.1.09 లక్షల కోట్లను గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టింది. ఇక ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రూ.60 వేల కోట్ల మేర కార్పొరేషన్లే నేరుగా అప్పులు చేశాయి..’అని విశదీకరించనున్నారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.12 లక్షల కోట్లకు పైగా కేవలం మిషన్‌ భగీరథ, సీతారామ, కాళేశ్వరంతో పాటు కొంతమేర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ శాఖల్లో కొంత వెచ్చించి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అయితే 1956 నుంచి 2014 వరకు అన్ని బడ్జెట్‌లు కలిపి తెలంగాణకు వచ్చి న వాటా కేవలం రూ.5 లక్షల కోట్లకు పైగా మాత్రమే.

ఈ తక్కువ మొత్తంతోనే నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్‌ లాంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఇతర సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలు చేశాయి..’ అని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement