పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు | Monthly salaries of Panchayat employees | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు

Jan 10 2025 4:45 AM | Updated on Jan 10 2025 4:45 AM

Monthly salaries of Panchayat employees

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చెల్లించండి

ఇబ్బంది రాకుండా గ్రీన్‌ చానల్‌ ద్వారా ఇవ్వండి 

ఉపాధి బిల్లులు సకాలంలో కూలీలకు అందాలి

పంచాయతీరాజ్‌ సమీక్షలో సీఎం రేవంత్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెలనెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.116 కోట్లు జీతాలుగా చెల్లించాల్సి ఉంది. 

ఈ జీతాల చెల్లింపులో ఆలస్యం జరగకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్‌ చానల్‌ ద్వారా వీరికి జీతాలు చెల్లించాలని సూచించారు. గురువారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 

కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇచ్చే బిల్లులను సకాలంలో చెల్లించాలని సీఎం ఆదేశించారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని.. వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను త్వరగా చెల్లించాలని అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement