Child Sexual Abuse: బాలికలేది భద్రత..?

Molestation On Children: Pocso Cases Increasing In Karimnagar - Sakshi

రెచ్చిపోతున్న కామాంధులు

ఐదేళ్లలో నమోదైన పోక్సో కేసులు 272 

కరీంనగర్‌లో ప్రత్యేకంగా పోక్సో కోర్టు

కేసుల దర్యాప్తునకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ

అయినా తగ్గని అఘాయిత్యాలు

‘కరీంనగర్‌ కార్ఖానగడ్డలోని ఓ ప్రయివేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న విద్యార్థిని పారిపోయి ఇంటికి చేరింది. తరువాత కూడా పలుమార్లు అదేతీరున వేధించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. వారు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణ జరిగి.. నిందితుడికి ఐదేళ్ల కఠినకారాగార శిక్ష పడింది.’

‘ఎల్‌ఎండీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు మైనర్‌ బాలికను ప్రేమపేరుతో మోసం చేశాడు. బాలిక ఫిర్యాదుతో ఎల్‌ఎండీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పోక్సో కోర్టు నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.’

సాక్షి, కరీంనగర్‌: పసిమొగ్గలపై కామాంధుల పైశాచికత్వం పెరిగిపోతోంది. వావివరుసలు, బంధాలను మరిచిపోయి కామాంధులు చిన్నారులను కాటేస్తున్నారు. కన్నకూతురు పైనే అత్యాచారం చేసి తండి అన్న పదానికే కలంకం తీసుకొచ్చే  ఘటనలు జిల్లాలో చాలా జరిగాయి. పాఠాలు చెప్పి భవిష్యత్తును బంగారుమయం చేయాల్సిన మాస్టార్లు కీచకులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. బాలికలను మృగాళ్ల నుంచి రక్షించేందుకు సర్కారు చట్టాలు తీసుకొచి్చంది. చిన్నారులపై లైంగికవేధింపుల నిరోధక చట్టం(పోక్సో) ద్వారా నిందితులను కఠినంగా శిక్షిస్తుండగా.. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 2017– 2021 కాలంలో 272 పోక్సో కేసులు నమోదు  అయ్యాయి.
చదవండి: tsrtc చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌: కేబినెట్‌ ఆశిస్తే.. కార్పొరేషన్‌

 అండగా పోక్సో చట్టం
► చిన్నారులపై లైంగిక దాడులు జరిగినప్పుడు కొందరు అవమానభారంతో బయటపడేందుకు సాహసించటం లేదు. ఇలాంటి సందర్భాల్లో అండగా నిలిచే చట్టాలున్నాయి. ఇలాంటి ఘటనలపై పోక్సో చట్టం ఉపయోగించి పోలీసులు కేసు నమోదు చేస్తారు. 
► 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే అత్యాచారాలు, అత్యాచారయత్నాలపై పోక్సోచట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ చట్టంలో అత్యాచారం, వేధింపులకు పాల్పడిన ఘటనల్లో కనీసం మూడేళ్లకు తగ్గని జైలు శిక్ష, అత్యధికంగా జీవితఖైదు, దీనికి తోడుగా అవరసమైతే జరిమానా కూడా విధిస్తారు.
చదవండి: తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం: బండి సంజయ్‌

►ఇంతటి కఠినమైన చట్టం ఏర్పాటయినప్పటకి కేసుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఆరేళ్ల వ్యవధిలో 247 పోక్సో కేసులు నమోదు కాగా.. అత్యధికంగా ఈ ఏడాది ఇప్పటివరకు 50 మందిపై కేసులు నమోదు అయ్యాయి. 
►జిల్లాలోని లైంగిక దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలోనో... లేదా బాధితులు చనిపోయినప్పుడో బహిర్గతమవుతున్నాయి. పరువుపోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలు దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసినవారై ఉండటం, పోలీసులకు ఫిర్యాదు చేస్తే బయటకు వచ్చాక మళ్లీ వేధిస్తారన్న అనుమానంతో మరికొందరు ఫిర్యాదు చేయడం లేదు. 

పోక్సో కేసులను విచారించి సత్వరంగా బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. పోక్సో కేసుల విచారణకు గతంలో ఐజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సులు, శిక్షణలు అందించారు. పోక్సోచట్టం ప్రకారం బాధితులు మైనర్లు కావడంతో యూనిఫాంలో ఉంటే భయబ్రాంతులకు గురవుతారు కాబట్టి.. సివిల్‌ డ్రెస్‌లోనే విచారణ జరిపి కావాల్సిన సమాచారాన్ని మైనర్ల నుంచి రాబట్టుతున్నారు. దీంతో కేసువిచారణ త్వరగా పూర్తవుతోంది.

పోక్సోకు ప్రత్యేక కోర్టు
కరీంనగర్‌లో పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీఎస్‌చౌహాన్‌ చేతుల మీదుగా జిల్లాకోర్టు సముదాయంలో ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పోక్సో కోర్టుకు సతీశ్‌కుమార్‌ న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. బాలికలు కోర్టుకు వచ్చేందుకు ప్రత్యేకంగా దారిని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోక్సో కేసుల విచారణ వేగవంతంగా సాగుతోంది. కరోనా సమయంలో కోర్టులు సరిగా నడవకపోవడంతో కొంత నెమ్మదించినప్పటికి మళ్లీ పుంజుకుంది. కమిషనరేట్‌వ్యాప్తంగా ఐదేళ్లనుంచి 196 కేసులు నడుస్తుండగా ఇందులో 08 కేసులకు శిక్షలు పడ్డాయి. 

వేగంగా దర్యాప్తు 
మహిళలు, యువతులు, మైనర్‌ బాలికలపై అత్యాచారాలు జరగకుండా కమిషనరేట్‌వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇబ్బందుల్లో హ్యాక్‌ఐ యాప్, డయల్‌ 100, వాట్సాఫ్‌ల ద్వారా ఫిర్యాదు చేసినా వేగంగా స్పందిస్తున్నాం. వీటిపై పోలీసులు, షీటీంకు చెందిన వారితో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.  ఫోక్సో కేసుల విచారణకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందించి దర్యాప్తు వేగంగా జరిపి సరైన అధారాలతో కోర్టుల్లో ప్రవేశ పెడుతూ నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
  – వి.సత్యనారాయణ, కరీంనగర్‌ సీపీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top