ఎంఎంటీఎస్‌–2 పరుగులు ఎప్పుడు? 

MMTS 2  Rails To Start Step By Step In Hyderabad - Sakshi

మూడేళ్లలో 80 శాతం పనులు పూర్తి 

రైల్వే శాఖ తాజా ప్రకటనతో మిగతా పనులపై సందిగ్ధత 

రాష్ట్రం నుంచి నిధులు వస్తేనే పనులు పూర్తవుతాయన్న మంత్రి 

ఇటీవలి బడ్జెట్‌లో రెండో దశకు కేటాయింపులు చేయని వైనం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం – రైల్వే మధ్య వివాదం ముదురుతోంది. దీంతో ఎంఎంటీఎస్‌ రెండో దశలో మిగిలిన 20 శాతం పనులు ఎప్పటికి పూర్తవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగర ట్రాఫిక్‌ను కొంతమేర తగ్గించటంలో ఎంతో కీలకంగా మారిన ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు విస్తరణలో ఇంతకాలం ఇరుపక్షాల పట్టు విడుపులతో కొనసాగిన వ్యవహారం ఇప్పుడు పీటముడిగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తేనే ఆ పనులు ముందుకు తీసుకెళ్తామన్న తరహాలో రైల్వే శాఖ వ్యాఖ్యలు చేస్తుండటం దీనికి నిదర్శనం.

ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఎంతోకొంత నిధులు కేటాయిస్తూ వస్తున్న రైల్వే, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో దాన్ని పట్టించుకోలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేస్తే, మధ్యంతరంగా నిధులు కేటాయించుకోవచ్చన్న భావనతో ఉంది. అయితే ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో సైతం ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు కనిపించకపోవడం.. రైల్వే తాజా వైఖరికి కారణంగా కన్పిస్తోంది.  

ఇప్పటివరకు రూ.130 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 
ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకు కొనసాగింపుగా సనత్‌నగర్‌–మౌలాలి, సికింద్రాబాద్‌–బొల్లారం, సికింద్రాబాద్‌–ఘట్కేసర్, లింగంపల్లి–తెల్లాపూర్, ఫలక్‌నుమా–ఉందానగర్‌ మధ్య లైన్ల నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదనలే. దీన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రైల్వే.. సంయుక్త ప్రాజెక్టుగా పట్టాలెక్కించాలని ప్రతిపాదించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటంతో రూ.817 కోట్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో మూడింట రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం, ఒక వంతు రైల్వే భరించేలా ఒప్పందం కుదిరింది. ఆ లెక్కన రూ.270 కోట్లు రైల్వే ఖర్చు చేయాల్సి ఉంది. దాదాపు మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించి వేగంగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.130 కోట్ల వరకు కేటాయించింది. ఆ తర్వాత నిధుల రాక ఆగిపోయింది. 

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రైల్వే కినుక! 
అప్పటికే పనులు జరుగుతున్నందున తాను ఖర్చు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ మొత్తం.. దాదాపు రూ.450 కోట్లు రైల్వే వ్యయం చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు లేఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది. అధికారులను కలసి చెప్పింది. కానీ నిధులు రాకపోవటంతో క్రమంగా పనుల్లో మందగమనం మొదలైంది. వాస్తవానికి ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి.

సనత్‌నగర్‌–మౌలాలి మధ్య 5 కి.మీ. రక్షణ శాఖ స్థలం విషయంలో స్పష్టత రాకపోవడంతో అంత మేర మినహా మిగతా పనులు పూర్తయ్యాయి. సికింద్రాబాద్‌–బొల్లారం పనులు దాదాపు పూర్తయ్యాయి. లింగంపల్లి–తెల్లాపూర్‌ మధ్య పనులు పూర్తి చేసి నైట్‌హాల్ట్‌ సర్వీసును కొంతకాలం నడిపింది. తాజాగా ఫలక్‌నుమా–ఉందానగర్‌ మధ్య ఎలక్ట్రిఫికేషన్‌ను కూడా రైల్వే పూర్తి చేసింది. ఒక్క ఘట్కేసర్‌ పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే ఎన్నిసార్లు కోరినా రాష్ట్రవాటా నిధులు రావటం లేదన్న ఉద్దేశంతో ఇక పనులు నిలిపివేయాలని రైల్వే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఖర్చు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువగా వ్యయం చేసినందున, రాష్ట్రప్రభుత్వం నుంచి బకాయిలు వస్తేనే పనులు జరపాలని ఢిల్లీ నుంచి స్థానిక రైల్వే అధికారులకు సమాచారం అందింది.

ఇంతకాలం ఈ విషయంలో పెద్దగా ప్రకటనలు చేయని స్థానిక జీఎం కూడా ఇటీవల రాష్ట్రం నుంచి నిధులు వస్తేనే ఈ పనులు పూర్తవుతాయంటూ బహిరంగ ప్రకటన చేశారు. తాజాగా రైల్వే శాఖ మంత్రి స్వయంగా పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఇదే విధమైన సమాధానం చెప్పటంతో ఇక పనుల్లో ప్రతిష్టంభన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కొత్త మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రారంభమైతే నగరంలో ట్రాఫిక్‌కు కొంత ఊరట లభించే  అవకాశం ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top