‘స్టేషన్‌ ఘనపూర్‌ నీ జాగిరి కాదు’.. తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్‌

MLC Kadiam Srihari Criticized MLA Rajaiah In Station Ghanapur - Sakshi

సాక్షి, జనగామ: స్టేషన్ ఘనపూర్‌ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చిల్లర పనులు చిలిపి చేష్టలు పనికిరావన్నారు.

‘తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే రాజయ్య, దేశంలో బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం ఘనత ఆయనదే. రాజయ్య తప్పు చేస్తూ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన అవినీతిపై ఆధారాలు బయటపెడితే గ్రామాల్లో తిరగలేడు. నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అన్ని మూసుకొని ఉంటున్నాను. మోసం చేసే అలవాటు, వెన్నుపోటు పొడిచే ఉద్దేశం నాకు లేదు. కేసీఆర్ నాయకత్వంలో వారి ఆదేశం మేరకు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను.

రాజయ్యకు సూటిగా సవాల్ చేస్తున్నాను. స్టేషన్ ఘనపూర్ నీ అడ్డ అయితే పార్టీ ప్రస్తావన లేకుండా స్వచ్ఛంద సంస్థతో సర్వే చేపిద్దాం. ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా.. శ్రీహరిని కోరుకుంటున్నారా? సర్వే రిపోర్ట్ తేల్చుతుంది. సర్వే రిపోర్టుకు కట్టుబడి ఉంటావా? నా సవాల్‌కు స్పందించు. డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకునే పరిస్థితి వద్దు. నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ‍్మెల్సీ కడియం శ్రీహరి. 

రాజయ్య వ్యవహారంపై ఉమ్మడి జిల్లా మంత్రులు, హనుమకొండ జనగామ జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. పార్టీ అధిష్టానం అన్ని గమనిస్తోందని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కు.ని. ఆపరేషన్లు వికటించి మరో ఇద్దరు మృతి.. హైవేపై భారీ బందోబస్తు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top