
వెస్ట్రన్ బీట్‌కు సంప్రదాయ నృత్యరీతుల జోడింపు
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో కొత్త ప్రయోగం
ప్రత్యేకంగా ఆస్వాదించిన మిస్ వరల్డ్ బృందం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ప్రారంభోత్సవంలో ఈసారి మిస్ వరల్డ్ లిమిటెడ్ చేసిన కొత్త ప్రయోగం బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై తొలుత కాస్త విముఖత ప్రదర్శించిన మిస్ వరల్డ్ సంస్థ తర్వాత ఆమోదించింది. చివరకది మిస్ వరల్డ్ బృందాన్నే బాగా ఆకట్టుకోవడంతో పాటు అనూహ్య స్పందన లభించింది. ఏ నగరంలో జరిగినా.. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో స్థానిక సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటం సహజం.
ఇదే తరహాలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రారంభోత్సవంలో 250 మంది కళాకారులతో తెలంగాణ సంప్రదాయ పేరిణి నృత్య విన్యాసాన్ని ప్రదర్శించారు. ఇంతవరకు ఎప్పుడూ జరిగే తంతే. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత, మిస్ వరల్డ్ పోటీదారులను వేదిక మీదకు ఆహ్వానించి పరిచయం చేస్తారు. కానీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పరిచయ భాగాన్ని ఒకింత కొత్తగా డిజైన్ చేశారు.
పోటీదారులను ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కో బృందం పరిచయానికి పైలట్ తరహాలో ఒక్కో సంప్రదాయ నృత్యరీతిని ప్రదర్శించేలా రూపకల్పన చేశారు. గుస్సాడీ, ఒగ్గు డోలు, లంబాడీ, కొమ్ము కోయ నృత్య కళాకారులను నాలుగు బృందాలుగా చేసి, ఒక్కో ఖండం పోటీదారులను కళాకారులు తమ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించే తరహాలో రూపొందించారు. దీనికి పాశ్చాత్య సంగీతాన్ని కూడా జోడించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వీక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అందాల పోటీకి తగ్గట్టుగా ప్రత్యేకంగా పేరిణి గీతం
250 మంది కళాకారులతో సంప్రదాయ పేరిణి నృత్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వినియోగించిన గీతాన్ని అందాల పోటీలను దృష్టిలో ఉంచుకుని రాయించటం విశేషం. ‘అతివల హంస నడకలతో అందమే సాగెనే..లలిత శృతుల గతుల లయల హొయల..అరవిరిసిన కన్నులకు అభినయాల వందనం.. అతి కోమల అధరాలకు అతి సుందర వందనం.. మనసెరిగిన మగువలకు మయూరాల వందనం..’అంటూ సాగిన గీతానికి తగ్గట్టుగా కళాకారులు నర్తించి ఆకట్టుకున్నారు. ఈ విధంగా సంప్రదాయ నృత్యాలతో పోటీదారులను స్వాగతించి పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని, పేరిణి సందీప్, ఫణి నారాయణ, శ్రీరాంభట్ల ఆదిత్య శర్మలు శ్లోకంతో కూడిన గీతాలను రచించారని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.