రైతులకు మేలు చేసేందుకే ధరణి

Minister Vemula Prashanth Reddy About Dharani portal - Sakshi

శాసనసభలో మంత్రి వేముల 

13 లక్షల ఫిర్యాదులొస్తే 12 లక్షలు పరిష్కారం 

రెండేళ్ళలో 24 లక్షల లావాదేవీలు

సాక్షి, హైదరాబాద్‌: వివాదాల్లేకుండా, భూ రికార్డులను భద్రపర్చి రైతులకు మేలు చేసేందుకే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చామని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధరణిలో భూమి నమోదు కాలేదని ఇప్పటివరకూ 13 లక్షల ఫిర్యాదులొస్తే 12 లక్షలు పరిష్కరించినట్టు చెప్పారు. రైతుకు తన భూమిపై పూర్తి హక్కు కల్పించే ధరణిని విపక్షాలు అడ్డుకోవడం విడ్డూరమన్నారు. గురువారం శాసనసభలో పలు పద్దులపై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. 

పైరవీకారుల రాజ్యాన్ని తెచ్చేందుకే.. 
రైతులను పీడించే పైరవీకారుల రాజ్యాన్ని మళ్ళీ తెచ్చేందుకే కాంగ్రెస్‌ పార్టీ ధరణిని వ్యతిరేకిస్తోందని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సాదా బైనామా ద్వారా భూమి రికార్డుల్లోకి ఎక్కించేందుకు 2016లోనే కాకుండా 2020లోనూ అవకాశం కల్పించామని, ఈ దశలోనే కోర్టు కేసు వల్ల ఇది ఆగిపోయిందన్నారు. ఈ రెండేళ్లలో ధరణి ద్వారా 24 లక్షల లావాదేవీలు జరిగాయని, కేవలం 15 నిమిషాల్లోనే లావాదేవీ పూర్తవుతోందని తెలిపారు. ధరణిలో 33 మాడ్యూల్స్‌ ఇవ్వడం వల్ల, ప్రతి గ్రామంలోనూ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయడం వల్ల సమస్యలు తగ్గుతున్నాయని చెప్పారు. 

58, 92 జీవోల ద్వారా క్రమబద్ధీకరణ  
125 గజాలున్న 1.25 లక్షల మంది పేదలకు 58 జీవో ద్వారా ఇళ్ళ జాగాలను క్రమబద్దీకరించామని, ఇళ్ళు కట్టుకున్న 36 వేల మంది పేదలకు 59 జీవో ద్వారా క్రమబద్ధీకరణ చేశామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో భవంతులు ఉన్న 44 కాలనీల్లో రెగ్యులైజేషన్‌ చేపట్టి, యజమానుల్లో ఆందోళన తగ్గించామని చెప్పారు.

2.92 లక్షల మందికి డబుల్‌ బెడ్రూ ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో 1.38 లక్షలు పూర్తి చేశామని, మరో 45 వేలు 90 శాతం పూర్తయ్యాయని, 35 వేలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ పథకానికి రూ. 11,639 కోట్లు ఖర్చవుతుంటే కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1,311 కోట్లు మాత్రమేనన్నారు. 

వక్ఫ్‌ భూములు పరిరక్షిస్తాం 
ఆదాయంలో రిజిస్ట్రేషన్ల శాఖ 3వ స్థానంలో ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన న్యాయపరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నామని, గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్డు, మండలం నుంచి జిల్లాకు డబుల్‌ రోడ్డు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top