సర్పంచ్‌ పాడె మోసిన మంత్రి జగదీశ్‌‌ రెడ్డి

Minister Jagadish Reddy At Peddavoora Sarpanch Cremation - Sakshi

అశ్రునయనాలతో విజయభాస్కర్‌రెడ్డి అంత్యక్రియలు

పెద్దవూర: అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందిన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్‌ అంత్యక్రియలు ఆదివారం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన మృతితో పెద్దవూర గ్రామ పంచాయతీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో మృతి చెందగా శనివారం రాత్రి 9 గంటలకు పెద్దవూర తీసుకువచ్చిన మృతదేహాన్ని ఆదివారం 11 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వందలాదిగా తరలివచ్చారు.  కిలోమీటర్‌ పైగా సాగిన అంతిమ యాత్రలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డిలు పాల్గొని నడిచారు. 

పాడె మోసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
తన సహచరుడు, సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నేత, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని పాడెను మోశారు. భాస్కర్‌రెడ్డితో తనకు గల అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

ప్రముఖుల పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన పెద్దవూర సర్పంచ్‌ కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ,  పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి,  ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, సాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కుమార్, ఎంసీ కోటిరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధసుందర్‌రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కంకణాల నివేదితారెడ్డి, డీవీఎన్‌రెడ్డి, ఇరిగి పెద్దులు, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top