రూ. 2,638 కోట్ల ఐజీఎస్టీ నిధులు వెంటనే ఇవ్వాలి

Minister Harish Rao Speaks In IGST Group Of Ministers Meeting - Sakshi

ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రూ.2,638 కోట్లు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. గురువారం ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం జరిగింది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన వాటాల గణాంకాలు ఆయన ప్రస్తావించారు. ఐజీఎస్టీ సొమ్ముతో పాటు సెటిల్మెంట్‌ బేస్డ్‌ యాన్యువల్‌ రిటర్న్స్‌ కింద మరో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీపై ఎలాంటి అభ్యంతరాలూ లేవని, ఏ రాష్ట్రానికి ఎంత రావాల్సి ఉందనేదానిపైనా స్పష్టత ఉందన్నారు. దీని ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రూ.25,058 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలని కోరారు.

గతంలో ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా జమ చేశారని ‘కాగ్‌’ఎత్తి చూపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కాబట్టి ఎలాంటి చర్చా లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని ఈ నెల 5న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సిఫారసు చేయాలని కోరారు. దీనికి ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ కన్వీనర్, బిహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ అంగీకరించారు. రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలనే సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 2018–19లో రూ.13,944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేయడాన్ని కాగ్‌ తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు రూ.210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top