పోలీసులు కొట్టారని.. పెళ్లి బృందం పోలీస్ స్టేషన్ ముట్టడి

Marriage Family Protest In Front Of Police Station For Beating Adilabad - Sakshi

సాక్షి,(ఖానాపూర్‌)ఆదిలాబాద్‌: పోలీసులు కొట్టారని పెండ్లి బృందం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన సంఘటన పెంబి మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పెళ్లి కుటుంబం వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బడుగు కళ్యాణ్‌యాదవ్‌ వివాహ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పెండ్లి కుమారుడు తన ఇంటి వద్ద డీజేతో డ్యాన్స్‌ చేస్తున్నాడు. రాత్రి 11గంటలకు ఎస్సై మహేశ్‌ అక్కడికి చేరుకుని డ్యాన్స్‌ చేస్తున్న మహిళలు, చిన్నారులను కూడా చూడకుండా లాఠీతో కొట్టాడని ఆరోపించారు.

దీంతో ఆగ్రహించిన పెళ్లి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. సీఐ అజయ్‌బాబు, ఖానాపూర్, కడెం ఎస్సైలు రజనీకాంత్, రాజు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ విషయమై ఎస్సై మహేశ్‌ను వివరణ కోరగా.. డీజేకు అనుమతి లేదని చెప్పినా వినలేదని, లాఠీ తీయగానే తొక్కిసలాటలో కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న వారే తనవెంట ఉన్న సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. స్టేషన్‌లో కిటికీల అద్దాలు పగలగొట్టిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.  

పోలీసులపై దాడిచేసిన వారిపై చర్యలు
ఖానాపూర్‌: పెంబిలో బుధవారం రాత్రి బి.కళ్యాణ్‌ వివాహ వేడుకలో అనుమతి లేకుండా డీజే నిర్వహిస్తుండగా.. ఆపేందుకు వెళ్లిన పోలీస్‌ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టామని సీఐ అజయ్‌బాబు తెలిపారు. పట్టణంలో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. డీజే విషయమై ఏఎస్సై గంగారెడ్డి, కానిస్టేబుల్‌ సంతో«ష్‌ అక్కడికి వెళ్లారు. ఇందులో సంతోష్‌పై పలువురు దాడిచేయడంతో గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎస్సైని సైతం ఘెరావ్‌ చేశారన్నారు. ఈ విషయమై నిందితులతో పాటు డీజే నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top