చేజారుతున్న కర్రిగుట్టలు | Maoists attempt to re enter Telangana from Karriguttalu | Sakshi
Sakshi News home page

చేజారుతున్న కర్రిగుట్టలు

Jan 31 2025 2:21 AM | Updated on Apr 3 2025 5:56 PM

Maoists attempt to re enter Telangana from Karriguttalu

మావోయిస్టుల చేజారనున్న కర్రిగుట్టలు 

భద్రతా దళాల ఆధిపత్యం 

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులకు పెట్టని కోట 

కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్‌ జోన్లు 

ఈ అంశాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన సీఎం రేవంత్‌ 

గత జూలైలో కర్రిగుట్టలో పోలీసుల కూంబింగ్‌  

‘పూజారి కాంకేర్‌’తో గుట్టల్లోకి భద్రతా దళాలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్‌ కగార్‌ ఫలితంగా.. దండకారణ్యంలో తమకు పట్టున్న ఒక్కొక్క ప్రాంతాన్ని మావోయిస్టులు (Maoists) కోల్పోతున్నారు. ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రిగుట్టలు ప్రాంతం సైతం మావోయిస్టుల చేజారిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జాయింట్‌ టాస్క్ ఫోర్స్ ..
కర్రిగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు తెలంగాణలో మళ్లీ ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గతేడాది జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా.. ఈ గుట్టలకు సరిహద్దుగా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయిలో సీఆర్‌పీఎఫ్‌ (CRPF) జాయింట్‌ టాస్క్ ఫోర్స్  క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. 

అనంతరం జూలై 19న కర్రిగుట్టల్లోకి స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోగా.. మిగిలిన దళ సభ్యులు తప్పించుకున్నారు. దీంతో గాలింపు ఉధృతం చేసే లక్ష్యంతో అదనపు బలగాలు ఈ గుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయాన వర్షాల కారణంగా పొంగిన వాగులు, వంకలతో స్పెషల్‌ పార్టీ పోలీసులంతా అడవిలో చిక్కుకుపోయారు. వీరికి వాయుమార్గంలో సాయమందించడం వీలు పడలేదు. దీంతో ప్రతికూల పరిస్థితుల నడుమ సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తెలంగాణ సరిహద్దుకు.. తెలంగాణ పోలీసులు చేరుకోగా.. చివరకు వారిని హెలీకాప్టర్‌ సాయంతో కాపాడారు.

కర్రిగుట్టల్లో భద్రతా దళాలు 
కర్రిగుట్టల్లో ఛత్తీస్‌గఢ్‌ వైపు పూజారి కాంకేర్‌ – మారేడుబాక అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు, భద్రతా దళాల నడుమ ఈనెల 16న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలిన వారు తప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం కర్రిగుట్టల్లో సుమారు రెండు వేల మందికి పైగా సంయుక్త భద్రతా దళాల జవాన్లు కూంబింగ్‌ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. 

వచ్చే వేసవి చివరి నాటికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి నామమాత్రం చేయాలని భద్రతా దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఈ దాడిలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. అయితే, ఇప్పటికీ మావోయిస్టు శిబిరాలు భద్రతా దళాలకు చిక్కకపోవడం.. ఈ గుట్టల్లో నెలకొన్న సంక్లిష్టతను చెబుతోంది.

మావోయిస్టుల అడ్డా బస్తర్‌  
దేశంలోనే మావోయిస్టులకు బస్తర్‌ ప్రాంతం అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే బస్తరేతర ప్రాంతాలకు చెందిన వివిధ రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీలు పని చేస్తున్నట్టు సమాచారం. బస్తర్‌కు చెందిన కీలక కమిటీలైన దండకారణ్య స్పెషల్‌ జోనల్, దక్షిణ బస్తర్‌ జోన్‌ వంటి కమిటీలు సంచరిస్తూ పని చేస్తుంటాయి. కానీ, బస్తర్‌ బయటి ప్రాంతాలకు చెందిన కమిటీలు ఎక్కువగా శిబిరాల్లోనే షెల్టర్‌ తీసుకుంటాయి. 

ఈ కమిటీలకు చెందిన వివిధ దళాలు.. అప్పుడప్పుడు తమ సంబంధిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి షెల్టర్‌ జోన్లకు చేరుకుంటున్నా యి. అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఇతర డివిజన్, ఏరియా కమిటీలు కర్రిగుట్టలు కేంద్రంగా షెల్టర్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాల్వంచ – మణుగూరు, ఏటూరునాగారం – మహదేవపూర్‌ ఏరియా కమిటీల సభ్యులు కర్రిగుట్టల నుంచి తెలంగాణకు వచ్చి గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 15 మంది చనిపోయారు.

రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా..
తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సహజ సరిహద్దుగా కర్రిగుట్టలు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో.. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే చోటునుంచి ప్రారంభమయ్యే కర్రిగుట్టలు.. చర్ల మండలంలో తాలిపేరు వాగు గోదావరిలో కలిసే వరకు ఇంచుమించు 100 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంటాయి.

చ‌ద‌వండి: వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల సంచ‌ల‌న‌ నిర్ణ‌యం 

గుట్టలకు ఆవలి వైపు బీజాపూర్‌ జిల్లా ఉండగా.. తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొద్ది భాగం ఉంటాయి. ఈ గుట్టల మధ్య పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్‌ జోన్‌గా ఉపయోగపడుతోంది. తెలంగాణలో పట్టు కోసం మావోయిస్టులు ఇక్కడి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement