
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని బుధవారం ఉదయం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. దంతెవాడ జిల్లా కట్టే కల్యాణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీక్‌పాల్–మర్జుమ్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్–17 బెటాలియన్‌కు చెందిన ప్రత్యేక బలగాలు మంగళవారం ఉదయం నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చీక్‌పాల్ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపడంతో ఒక మావోయిస్టు మృతిచెందగా...అతడి వద్ద ఒక తుపాకీ లభ్యమైంది. మృతిచెందిన మావోయిస్టును కట్టే కల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు ముసికి ఇడమాగా గుర్తించారు. ఇతడిపై గతంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5లక్షల రివార్డును ప్రకటించి ఉంది.