అంబానీ, అదానీలకే పెద్దపీట | Malini Bhattacharya Comments Over Central Government | Sakshi
Sakshi News home page

అంబానీ, అదానీలకే పెద్దపీట

Sep 26 2021 2:48 AM | Updated on Sep 26 2021 2:48 AM

Malini Bhattacharya Comments Over Central Government - Sakshi

సూర్యాపేట: అంబానీ, అదానీల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య ఆరోపించారు. పేటలో కొనసాగుతున్న ఐద్వా రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా శనివారం రెండవరోజు ప్రతినిధుల సభను ప్రారంభించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కార్మి క చట్టాల సవరణ నిలిపివేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 27న జరిగే భారత్‌బంద్‌లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ, ఈ దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు, భూస్వాముల ప్రయోజనాలకు కట్టబెట్టాలని చూస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా మరో సాయుధ పోరాటాన్ని నిర్వహించాలన్నారు.

అంతకుముందు ఐద్వా రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచకంగా ఐద్వా జెండాను మల్లు స్వరాజ్యం ఆవిష్కరించారు. మహిళా ఉద్యమ అమరవీరుల చిత్రపటాల వద్ద ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియధావలే, జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య తదితరులు నివాళులర్పించారు. గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు మృతిచెందిన వారందరికీ నివాళి అర్పిస్తూ ఐద్వా రాష్ట్ర నాయకురాలు సమీనా అఫ్రోజ్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మూడేళ్ల ఐద్వా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.సాయిబాబా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు,     కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శ్రీమతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement