సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో యువతిని హత్య చేసిన యువకుడు తేజ మృతిచెందాడు. నిన్న యువతి వైష్ణవిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు.. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. యువతిని కత్తితో విచక్షణారహితంగా తల, మెడపై పొడవడంతోపాటు గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృత్యువాత పడింది. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు.
ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచి్చన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్యచికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు పోలీసులను దరిచేరకుండా అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వివాదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరకు తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆ యవకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్యకు భార్య శ్రీలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఈమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారు కన్నీటిపర్యంతం అయ్యారు.
మరో వంద అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని, ఇంతలోనే దారుణ హత్యకు గురైనట్లు వారు పేర్కొన్నారు. దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొన్నాడు.


