LRS Reciept Missing: ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదు పోయింది.. ఇప్పుడెలా? అ‘ధనం’ కట్టాల్సిందేనా?

LRS Reciept Missing Many House Owners To Pay Extra Amount In Telangana - Sakshi

‘మామునూరులో 200 గజాల ఓపెన్‌ ప్లాట్‌ ఉన్న వినయ్‌ భవన నిర్మాణానికి మున్సిపల్‌ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్‌ విలువ ఆధారంగా భవన నిర్మాణ ఫీజు చెల్లించాలి. కానీ అతడు దరఖాస్తు చేసుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదును పోగొట్టుకున్నాడు. ఎల్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి వస్తోంది’ 

‘నర్సంపేటలో ఉండే సిద్ధు్ద తనకున్న 160 గజాల ఓపెన్‌ ప్లాట్‌లో ఇళ్లు కట్టుకుందామనుకున్నాడు. ఓ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ను సంప్రదించాడు. సేల్‌డీడ్‌ డాక్యుమెంట్లు, లేఅవుట్‌ కాపీతో పాటు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదు కావాలని సర్వేయర్‌ అడిగాడు. అది ఉంటే తప్ప అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజు దాదాపు రూ.20వేల వరకు తగ్గే అవకాశముందని చెప్పాడు. అయితే సిద్ధు ఆ రిసిప్ట్‌ను ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎల్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు తెరుచుకోలేదు. దీంతో అతడికీ అదనంగా డబ్బు చెల్లించడం తప్పలేదు’

సాక్షి, వరంగల్‌: కోవిడ్‌ వ్యాప్తి తగ్గడంతో సొంతిటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ముందుకొస్తున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్‌ మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం భవన నిర్మాణానికి ఆన్‌లైన్‌లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకొని ఆ రసీదు పొంది ఉంటే.. ఇంటి పర్మిషన్‌కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఎల్‌ఆర్‌ఎస్‌లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేశారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లోనూ రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు.

తెరుచుకోని సైట్‌!
అక్రమ లే అవుట్లలో ఓపెన్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్లక్రితం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్‌ ఫీజును ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్‌ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్‌ విలువను పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుం మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి  రసీదు కలిగి ఉండి టీఎస్‌బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్‌ విలువ ప్రకారమే ఫీజు చెల్లించవచ్చు.

కానీ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రిసిప్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడూ వెబ్‌సైట్‌ https://lrs.telangana.gov.in కు వెళ్లి ఫోన్‌ నంబర్‌ ఎంట్రీ చేస్తే ఓటీపీతో దరఖాస్తు ఓపెన్‌ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఓపెన్‌ అవడం లేదు. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలామంది ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కడుతున్నారు. 
(చదవండి: పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని తన్ని తరిమేశారు..)

ఇంటి నిర్మాణానికి సన్నద్ధం..
ప్రస్తుతం కోవిడ్‌ ఉధృతి తగ్గడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూసిన వేలాది మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించి అప్పటి రిసిప్ట్‌ ఉంటే.. గతంలోని మార్కెట్‌ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది.

కానీ చాలామంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లో వివరాలు లభించక 14 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుంతో ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ సైట్‌ను పునరుద్ధరించాలని, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు విన్నవిస్తున్నారు.    
(చదవండి: బాప్‌రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్‌ చలాన్లు క్లియర్‌!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top