
ప్రభుత్వ వైఖరితో రాజధానిలో నిలిచిపోయిన భూముల క్రయవిక్రయాలు
నాలుగు నెలల కిందట ఆకాశాన్నంటిన ప్లాట్లు, పొలాల ధరలు
భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో అంతటా సందడే సందడి
అమరావతిలో భూములు విక్రయించి మరో ప్రాంతంలో కొనుగోలు
రాజధానికి మరో 45 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు పట్టు
నెల రోజుల నుంచి స్తంభించిపోయిన స్థిరాస్తి కార్యకలాపాలు
గోళ్లు గిల్లుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు
రెండో దశ పూలింగ్‌పై ప్రభుత్వ ప్రకటనతో అందరిలో ఆందోళన
రాజధానిలో ప్లాట్లు, పొలాల కొనుగోలుకు ముందుకురాని ప్రజలు
రాజధాని నిర్మాణం పేరుతో 11 ఏళ్ల కిందట తీసుకున్న భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటికీ ఇచ్చిన ప్లాట్లు కాగితాలపైనే ఉన్నాయి. ఎకరం పొలం తీసుకుని చేతిలో పెట్టిన 1,200 గజాలు కాగితాలకు కనీసం బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా మరో 45 వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల రైతులకు ఇది మింగుడు పడటం లేదు. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. కొత్తగా కొనేవారు లేక భూ లావాదేవీలు స్తంభించిపోయాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ, పెదకాకాని: రాజధాని ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు రూ. కోట్లకు పడగలెత్తుతాయని ఆశ, ఆరాటంతో ఓటు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో ఎకరం అమ్ముకొని సొమ్ము చేసుకొని వేరే ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామని ఆశతో బేరం పెట్టారు. ఎకరం అమాంతంగా రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు అడుగుతుండటంతో అమ్మో అప్పుడే అమ్మితే ఎలా అని రోజుకో రకంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్తూ మురిసిపోతూ కాలం వెళ్లబుచ్చారు.
ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. ఇక మరో రైతు ప్రభుదాసు తమవారు తరాలుగా కష్టపడి సంపాదించి ఇచ్చిన అర ఎకరం పొలం విక్రయిద్దామని బేరం పెట్టారు. రూ.3 కోట్లకు 1/3వ వంతు నగదు తీసుకొని 3 నెలల తరువాత రిజిస్ట్రేషన్ చేసుకుందామని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ డబ్బుతో మరో ప్రాంతానికి వెళ్లి ఎకరం రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా ఎందరో రైతులు రాజధాని ప్రాంతంలో తమ భూములను అమ్మకాలు, కొనుగోళ్ల సందడితో మురిసిపోయారు. కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి రెండు నెలల క్రితం అదనపు భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో రైతుల గుండెల్లో బాంబు పడినట్టైంది.
ఒక్కసారిగా నిస్తేజం
రెండో విడత భూ సమీకరణ పేరుతో అమరావతి, తుళ్ళూరు మండలాల్లో గ్రామ సభలు నిర్వహించిన ప్రభుత్వం తొలుత 45 వేల ఎకరాలను సమీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. తదనంతరం సభలను విస్తరించి తాడికొండ మండలంలో కూడా చేపట్టడంతో రైతులు మండిపడ్డారు. ఉన్నట్టుండి విరుచుకుపడటంతో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కేసింది. కానీ నిన్న మొన్నటి వరకు రూ. కోట్లలో పలికిన భూముల ధరలు మాత్రం ఆకాశం నుంచి కుప్పకూలిన చందంగా ఒక్కసారిగా పడిపోయాయి.
అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైతుల ఆనందం అంతా ఇంతా కానప్పటికీ అగ్రిమెంట్‌ల రూపంలో ఉన్న రైతులు, అప్పుల పాలై అమ్ముకుందామని ఎదురు చూస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడూ సందడిగా ఉండే రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి. అదే తరహాలో పెదకాకాని రిజి్రస్టార్ కార్యాలయంలో కూడా రిజి్రస్టేషన్‌ల సంఖ్య తగ్గిపోయింది.
సొంత పార్టీ నేతల తిరుగుబాటు
నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండమైన రాజధాని నిర్మించి ప్రపంచంలోనే గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటూ ప్రగల్బాలు పలికిన సొంత పార్టీ నేతలే నేడు తిట్ల దండకం అందుకుంటున్నారు. బాబును నమ్మితే నట్టేట ముంచారని, నమ్ముకున్నవాడిని మోసం చేయడం అంటే ఇదేనని వాపోతున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న భూముల్లో రాజధాని నిర్మిస్తే సరేసరి.. లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు.
ఇప్పటికే భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు సైతం ఇవ్వలేదు, ఇచ్చిన వారికి ప్లాట్లు భౌతికంగా ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇంకా రిజి్రస్టేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. అభివృద్ధి చేసి 10 సంవత్సరాల్లో ప్లాట్లు తిరిగిస్తానన్న బాబు విదేశీ పర్యటనలు, అదనపు భూ సమీకరణ పేరుతో రైతులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయింది. రాజధానిలో ఏవేవో కడతానని చెప్పడం మినహా పునాదులను సైతం అడుగు కూడా పైకి లేపిన దాఖలాలే లేవు.
అప్పు కూడా పుట్టక అవస్థలు
అదనపు భూ సమీకరణ ఊసు లేనప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రాంతాన్ని బట్టి గజం రూ.40 వేలు నుంచి రూ.80 వేలు పలికిన భూముల ధరలు ఇప్పుడు కొనేందుకు వ్యాపారులు, ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఆ భూమిని కనీసం బ్యాంకులో అయినా తనఖా పెట్టుకొని అప్పు తీసుకుందామా అంటే అధికారులు ఒప్పుకోవడం లేదు.
దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో తుళ్ళూరు రాజధాని ఉంటే పెదకాకాని మండల శివారులో ఉన్న మంగళగిరి రూరల్ మండలం కాజ, తాడికొండ మండలంలోని కంతేరు గ్రామం వరకూ భూములు సేకరిస్తారని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అవసరానికి కూడా విక్రయించలేక పోతున్నామని, ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యాపార ధోరణి విడనాడి స్పష్టమైన విధానం ప్రకటించాలని వారు కోరుతున్నారు.
కొనేవారు రావడం లేదు
భూములు కొనుగోలు చేసే వారు రావడం లేదు. ప్రభుత్వం మళ్లీ భూ సమీకరణ ప్రకటన చేసినప్పటి నుంచి వ్యాపారాలు సాగడం లేదు. పదేళ్లుగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. గతంలో ప్లాట్లు, పొలాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి చుట్టు పక్కల ప్రాంతాల్లో చూపించేవారం. అందుకు ప్రతిఫలంగా వారు కమీషన్ ఇచ్చేవారు. కొనేవారు ఇప్పుడు రాకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి.
– షేక్ మస్తాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకాని
స్థిరాస్తి రంగం కుదేలు
కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూములు సమీకరిస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. అమ్మేవారు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేవారు లేకపోవడంతో వ్యాపారం ఆగిపోయింది. నెల రోజులకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లు మాత్రమే రిజ్రస్టేషన్‌లు అవుతున్నాయి. ఈ నెలలో ఒక్క బేరం కూడా జరగలేదు. భూములు కావాలని వచ్చేవారు తగ్గిపోయారు. ప్రభుత్వం భూ సమీకరణపై స్పష్టత ఇవ్వాలి.
– పాటిబండ్ల సంగీతరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకాని