
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో యధేచ్చగా కొనసాగుతున్న భూదోపిడీపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరూపేరు లేని ఉర్సాలాంటి కంపెనీలకు విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు. సోమవారం (ఆగస్టు18) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. అడ్డూ అదుపు లేకుండా తమకు కావాల్సిన వారికి వేల ఎకరాలను కట్టబెడుతున్నారు. ఊరూపేరు లేని ఉర్సాలాంటి కంపెనీలకు విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారు?. వేల ఎకరాల భూములను ఏ ఉద్దేశంతో 99 పైసలకు విక్రయిస్తున్నారు?. అడ్రెస్ లేని కంపెనీలకు వేల ఎకరాలు ఎందుకు కట్టబెడుతున్నారు?
భూములు ఇచ్చే ముందు ఆ కంపెనీల ట్రాక్ రికార్డును కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఖరీదైన భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది. ఆ కంపెనీలకు ఇచ్చే భూముల వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా?. అధికార పార్టీ నేతల బినామీలకే భూములను ఇస్తున్నారు.
గ్లోబల్ సిస్టంలో భూములు ఇవ్వకుండా స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ళ వెనుక భారీ కుట్ర, అవినీతి జరుగుతోంది. మా హయాంలో రూ.2.49 పైసలకు కరెంటు కొంటే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు రూ.4.59 పైసలకు ఎలా కొంటున్నారు? మహిళా ప్రొఫెసర్ని వేధించిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.