తల్లికి వందనం పేరుతో తల్లులకు వంచన: మేరుగ నాగార్జున | Meruga Nagarjuna Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం పేరుతో తల్లులకు వంచన: మేరుగ నాగార్జున

Jun 14 2025 3:10 PM | Updated on Jun 14 2025 6:23 PM

Meruga Nagarjuna Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అమలు చేసినా తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తల్లులను మోసం చేసిందని, అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలోమాట్లాడారు.

యూడైస్‌ రిపోర్టు మీద అబద్ధాలు:
తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశాడు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా దేశంలో విద్యార్థుల వివరాలు సేకరించడానికి యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌)ను ప్రామాణికంగా తీసుకుంటారు. కలెక్టర్ల ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలను తీసుకుని యుడైస్‌ ద్వారా కేంద్రానికి నివేదిక ఇస్తుంటారు. దీని ప్రకారం రాష్ట్రంలో 87,41,855 మొత్తం మంది విద్యార్థులు ఉంటే దాదాపు రూ.13,110 కోట్లు చెల్లించాలి.

కానీ ప్రభుత్వం కేవలం రూ.8,745 కోట్లు మాత్రమే చెల్లించి మూడో వంతు విద్యార్థులకు చెల్లించకుండా మోసగించింది. ఇంటర్‌ వరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో పథకానికి అర్హులు కాకుండా ప్రభుత్వమే మోసగించింది. దీనినై వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్నిస్తుంటే, టీడీపీ నాయకులు యూడైస్‌ రిపోర్టు మీద కూడా అబద్ధాలు చెబుతున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ, అంగన్‌వాడీ పిల్లలను మినహాయించి ఈ యూడైస్‌ రిపోర్టును తయారు చేసినట్టు స్పష్టంగా ఉన్నా, బయట రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారంటూ వక్రభాష్యాలు చెబుతున్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, మంత్రి నారా లోకేష్‌ ఎదురుదాడి చేస్తూ, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.

నాడు జే ట్యాక్స్‌ అన్నారు. ఇప్పుడేమంటారు?:
ఎప్పుడిస్తారో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడ్డం పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నా తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకూ పథకాన్ని వర్తింప చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందే పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ డబ్బులు మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసిన పాపాన పోలేదు. కానీ రేషన్‌ కార్డు లేదనే కారణంతో పథకం ఎగ్గొట్టారు. మా హయాంలో స్కూల్‌ నిర్వహణ కోసం అమ్మ ఒడిలో వెయ్యి రూపాయలు మినహాయిస్తే జే ట్యాక్స్‌ అంటూ నారా లోకేష్‌ విషప్రచారం చేశాడు. కానీ తల్లికి వందనంలో చెప్పాపెట్టకుండా ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.2 వేలు లాగేసుకున్నారు. దీనికి మంత్రి నారా లోకేష్‌ ఏం సమాధానం చెబుతాడు?.

విద్యావ్యవస్థ సర్వనాశనమైంది:
నారా లోకేష్‌ నేతృత్వంలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యింది. నారా లోకేష్‌ నిర్వహించే ఈ శాఖలో నిర్వహణ, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బడులు ప్రారంభించే నాటికి బదిలీలు పూర్తి చేయలేదు, పైగా బడులు ప్రారంభమైన నాలుగైదు రోజులకు టీచర్ల ట్రైనింగ్‌ క్లాసులు మొదలుపెట్టారు. జీవో నెంబర్‌ 117  రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కాలంగా రద్దు చేయకపోగా దానికి ప్రత్యామ్నాయంగా మరో మూడు జీవోలు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరంచెల విద్యావిధానాన్ని తీసేసి 9 అంచెల విధానాన్ని తీసుకొచ్చారు. 

బడులు ప్రారంభం అయ్యే నాటికి ఇవ్వాల్సిన విద్యాకానుక కిట్లు ఇప్పటికీ చాలా స్కూళ్లకు చేరలేదు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీ విధానంలో పలుకుబడి ఉన్నారికి, డబ్బులిచ్చినవారికే ప్రాధాన్యత లభించిందే కానీ ఎక్కడా నిబంధనలు అమలు జరగలేదు. గతంలో 3,158 అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ ఉంటే, వాటిని పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించాడు. దీన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సుమారుగా 1303 అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ కొనసాగిస్తామని, 1076 అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌ బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చేస్తామని మరో అడ్డగోలు నిర్ణయం తీసుకుంది.

నాటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాడు–నేడు ద్వారా రెండు విడతల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు వెచ్చించి 38 వేల ప్రభుత్వ బడులను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అటకెక్కించారు. సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్టు, టోఫెల్‌ శిక్షణ, సీబీఎస్‌ఈ సిలబస్, 8 తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు వంటి వినూత్న ఆలోచనతో దేశంలో ఏపీ విద్యావ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెడితే ఏడాది పాలనతోనే వాటికి ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు భయపడిపోయే దుస్థితి కల్పించారు.

రూ.1306 కోట్లు వెచ్చించి 9,52,925 ఉచిత బైజూస్‌ కంటెంట్‌ ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. ఆరోతరగతి నుంచి ఆ పైన తరగతులకు రూ.838 కోట్లతో 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ), 45 వేల స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేశాం. వీటన్నింటినీ కూటమి సర్కారు రద్దు చేసింది. గోరుముద్ద పథకం కోసం ఐదేళ్లలో మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,244.60 కోట్లు వ్యయం చేసింది. రోజుకో మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెట్టాం. కానీ కూటమి పాలనలో గోరుముద్ద కాస్త ‘ఘోర ముద్ద’గా మారిపోయింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అతిసారం బారిన పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. 

వైఎస్సార్సీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం ఎప్పటికప్పుడు విడుదల చేసేవాళ్లం. కానీ కూటమి సర్కారు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.7,800 కోట్లు పెండింగ్‌ పెట్టింది. 2024–25లో కేవలం రూ.700 కోట్లు విడుదల చేసి, రూ.7,100 కోట్లు బకాయిలు పెట్టింది. 2025–26 బడ్జెట్‌ లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయించినట్లు చూపారు. వీటన్నింటి ద్వారా పిల్లల చదువులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది.

వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు
విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలను నాశనం చేసిన కూటమి ప్రభుత్వం, మరోవైపు శాంతి భద్రతలు కాపాడడంలోనూ దారుణంగా విఫలమైంది. పొగాకు రైతుల పరామర్శ కోసం పోలీసుల అనుమతితో మా నాయకుడు వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లారు. అక్కడికి వేలల్లో వచ్చిన ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు మాపై రాళ్ల దాడికి దిగితే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. నిరసన పేరుతో అడ్డుకోవాలని చూసిన వారికి రక్షణ కల్పించడమే కాకుండా, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. చివరకు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాదరెడ్డికి కూడా నోటీసులిచ్చారు.

దళితులపై దమనకాండ:
రాష్ట్రంలో దళితుల కుటుంబాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. యథేచ్ఛగా చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల దళిత విద్యార్థిని మీద 18 మంది టీడీపీ యువకులు ఆరు నెలలుగా అత్యాచారం చేసిన విషయం సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించివేశారు. ఆ బాలిక కుటుంబం టీడీపీ సానుభూతిపరులే అయినా ఆ పార్టీ నాయకులే అన్యాయం చేశారు. ఇంటర్‌ చదువుతున్న మరో గిరిజన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి దారుణంగా చంపేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మా నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మీద అక్రమ కేసు నమోదు చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement