
ఆదిలాబాద్ జిల్లా ముఖరా(కే) గ్రామంలో కోర్టు తీర్పు వివరాల కోసం వివిధ చానళ్లను ఫోన్లలో చూస్తున్న ్రగ్రామస్తులు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
గత నెల 29 నుంచి ఉన్న ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేత... కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామన్న ఎస్‌ఈసీ కార్యదర్శి
జీవో 9పై కాకుండా.. నోటిఫికేషన్‌పై స్టేతో సందిగ్ధంలో ప్రభుత్వం
పాత రిజర్వేషన్ల ప్రకారంగానూఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లటంపై నేడు ప్రభుత్వం నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. గురువారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, సాయంత్రానికి హైకోర్టు దానిని నిలిపేయటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గత నెల 29 నుంచి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కూడా తొలగిపోయింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.
హైకోర్టు ఉత్తర్వుల పూర్తిపాఠం అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ పేర్కొంది. గతంలో ఎస్‌ఈసీ జారీచేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా గురువారం మొదటి విడత మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు జిల్లాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీచేశారు. గురు, శుక్ర, శనివారాల్లో నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా.. కేసు విచారణ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది.
తొలి రోజు మొత్తం 16 జెడ్పీటీసీ, 103 ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు మకరందు తెలియజేశారు. గత నెల 29న జారీచేసిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్లను తదుపరి నోటిఫికేషన్ వచ్చేవరకు తక్షణం నిలుపుదల చేస్తున్నట్టు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఓటర్లకు తెలియజేస్తున్నట్టు పేర్కొంది.
హైకోర్టు ఆదేశాల పూర్తి పాఠం అందాకే...
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు నుంచి పూర్తి ఆదేశాలతో కూడిన ‘సైన్డ్ కాపీ’అందాకే తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది. తీర్పు కాపీలో ఎలాంటి కారణాలు పేర్కొన్నారో పరిశీలించిన తరువాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్ల పెంపు, పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో ఈ అంశాలన్ని వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ప్రభుత్వపరంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకే అసెంబ్లీలో, బయటా, ఆర్డినెన్స్‌లు, బిల్లులు తేవడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు సాగించినందున వాటిని సాధించేవరకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్లాన్ ‘బీ’లేనట్టే ?
కొన్నాళ్లుగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఇటు ప్రభుత్వంలో, అటు రాజకీయ పార్టీల్లో పెద్ద కోలాహలమే కొనసాగింది. నోటిఫికేషన్ కూడా రావటంతో ఇక ఎన్నికలు జరగటమే తరువాయి అనుకున్నారు. కానీ, చివరకు ఊరించి ఉసూరుమనిపించినట్లు హైకోర్టు తీర్పుతో అంతా చల్లబడ్డారు. నిజానికి బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేస్తే.. ప్లాన్ బీ కింద పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెంటనే వెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ, హైకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాల్లో రిజర్వేషన్ల కోసం జారీచేసిన జీవో 9ను కాకుండా, ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, నోటిఫికేషన్‌పై స్టేకు గల అన్ని కారణాలను ఉత్తర్వుల్లో పొందుపరుస్తామని ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కావడంతో.. రిజర్వేషన్లను మార్చి పాత విధానంలో ఎన్నికలకు కూడా వెళ్లలేని స్థితిలో ప్రభుత్వం పడిపోయింది. హైకోర్టు స్టేను తొలగించాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని తీర్పు కాపీ వచ్చిన తరువాతే పరిశీలించాలని భావిస్తోంది.