80 మోటార్లతో ఎత్తిపోతలు

Lift irrigation with 80 motors - Sakshi

సొరంగంలో సాగని లైనింగ్‌ పనులు 

భూగర్భంలో ఉబికివస్తున్న నీటి ఊటలు 

కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులకు ప్రతిబంధకాలు 

రేయింబవళ్లు ఎత్తిపోస్తున్నా.. తగ్గని నీరు 

సిరిసిల్ల: కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించామని రాష్ట్ర ప్రభుత్వం సగౌరవంగా చెబుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే 9వ ప్యాకేజీ పనులకు ఇప్పుడు భూగర్భంలో ఉబికి వస్తున్న నీటి ఊటలు ప్రతిబంధకంగా మారాయి. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించే ఈ ప్యాకేజీ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ సొరంగంలో నీటి ఊటలతో లక్ష్యం నీరుగారుతోంది. కాంట్రాక్టర్లు 900 హెచ్‌పీల సామర్థ్యంతో 80 మోటార్లను అమర్చి రేయింబవళ్లు సొరంగంలోని నీటిని బయటకు ఎత్తిపోస్తున్నా..ఉబికి వస్తున్న ఊటలు తగ్గడం లేదు. సొరంగంలో లైనింగ్‌ పనులు సాగడం లేదు. 

ఇదీ లక్ష్యం.. 
జిల్లాలోని మధ్యమానేరు బ్యాక్‌ వాటర్‌ సిరిసిల్ల పట్టణాన్ని తాకి ఉన్నాయి. ఈ నీటిని అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా సిరిసిల్ల నుంచి కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ వరకు సొరంగం ద్వారా మళ్లించాల్సి ఉంది. ఇందు కోసం 13 కిలోమీటర్ల సొరంగం పనులు 2013 నుంచి కొనసాగుతున్నాయి. సొరంగంలోని లైనింగ్‌ కెనాల్‌తో గ్రావిటీ ద్వారా మల్క పేట వరకు గోదావరి జలాలు చేరుతాయి. మల్కపేట వద్ద పంపింగ్‌ స్టేషన్‌లో రెండు 30 మెగావాట్ల మోటార్లతో నీటిని ఎత్తి మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గంభీరావు పేట మండలం సింగసముద్రం చెరువులోకి అక్కడ ఏర్పాటు చేసిన రెండు 2.25 మెగావాట్ల మోటార్లతో నీటిని ఎత్తిపోస్తారు.

గ్రావిటీ ద్వారా ముస్తఫానగర్‌ బట్టలచెరువు నింపి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నర్మాల ఎగువ మానేరు నింపుతారు. 2.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎగువ మానేరు నిండితే.. సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.996.01 కోట్లతో 9వ ప్యాకేజీ పనులు చేపట్టారు. కానీ ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగులు పారడంతో సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ఎగువ మానేరు నిండి మత్తడి దూకుతోంది. మంత్రి కేటీఆర్‌ కాళేశ్వరం నీటితో ఎగువ మానేరు నింపాలని భావించగా.. సమృద్ధిగా వర్షాలు పడి అప్పర్‌ మానేరు నిండడం విశేషం. కాగా, 9వ ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఆర్థికంగా నీటిని ఎత్తిపోయడం అదనపు భారమే.  

సమాంతరంగా ఇతర పనులు చేయిస్తున్నాం.. 
సొరంగంలో నీటి ఊటల కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. సొరంగంలో లైనింగ్‌ పనులు సాగడం లేదు. సమాంతరంగా ఇతర పనులు చేయిస్తున్నాం. సింగసముద్రం వద్ద పంపు, మోటారు ఏర్పాటు, గ్రావిటీ కెనాల్‌ పనులు చేయిస్తున్నాం. నీరు తగ్గగానే సొరంగంలో లైనింగ్‌ పనులు పూర్తి అవుతాయి. టాప్‌ ప్రయార్టీగా 9వ ప్యాకేజీ పనులు చేస్తున్నాం.
– గంగం శ్రీనివాస్‌రెడ్డి, 9వ ప్యాకేజీ ఈఈ    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top