
పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం
ఇప్పటికే 20 శాతం ప్రక్రియ పూర్తి
మే నెల కోటా విడుదల
కొత్త సభ్యుల చేరిక దరఖాస్తుల ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డుదారుల పరేషాన్‌కు ఇక తెరపడనుంది. లబ్ధిదారులకు శుభవార్త. సరిగ్గా ఎనిమిదేళ్ల నిరీక్షణకు మోక్షం లభిస్తోంది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల(యూనిట్) ఆమోద ప్రక్రియ ఆరంభమైంది. పౌర సరఫరాల శాఖ ఆన్‌లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. అయితే రేషన్‌కార్డు (Ration Card) కలిగిన కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తుల్లో సుమారు 20 శాతం మేర పరిష్కరించి మే నెల రేషన్ కోటా కూడా కేటాయించింది. మిగతా దరఖాస్తులను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
ఆరు లక్షలపైనే కొత్త సభ్యులు..
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల్లో పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు మూడు లక్షలపైనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రేషన్‌కార్డుల్లోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం అతీగతీ లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు, మూడుగా ఏర్పడగా, మరోవైపు కుటుంబంలో మరి కొందరు కొత్త సభ్యులుగా చేరారు.
సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా, మొన్నటి వరకు ఆమోదించే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే రేషన్‌కార్డులోని సభ్యుల తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. తాజాగా కొత్త సభ్యులు చేర్పుల ఆప్షన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్న్‌ల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది.
చదవండి: తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
అర్హుల పేర్లకు ఆమోదం
పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోంది. మీ సేవా (Mee Seva) ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ప్రతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కొత్త యూనిట్లకు నెలవారీ రేషన్ కోటా కేటాయించాం. మరి కొన్ని కొత్త యూనిట్లకు వచ్చే నెల నుంచి రేషన్ కోటాకేటాయిసాం. ఆందోళన చెందవద్దు
– రమేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి, హైదరాబాద్