
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన
జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల్లో మాత్రమే భూముల విలువల పెంపు
రాష్ట్ర ప్రజలందరిపై భారం పడకుండా జాగ్రత్త
38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి మాత్రమే సవరణ ప్రతిపాదనలు
త్వరలో మంత్రి పొంగులేటి సమీక్ష..సీఎం ఆమోదించిన వెంటనే అమల్లోకి..
గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రస్తుతానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్న జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల్లో మాత్రమే భూముల విలువలను పెంచాలని, తద్వారా అటు ఆదాయం పెరగడమే కాకుండా, రాష్ట్ర ప్రజలందరిపై భారం పడకుండా ఉంటుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రతి ఏటా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతూ రెవెన్యూ ఎక్కువగా వచ్చే రాష్ట్రంలోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వం విలువల సవరణ ప్రతిపాదనలు తెప్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సవరణను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఆదాయం పెరగాల్సి ఉండటంతో..: గత ఏడాదిలోనే భూముల విలువల సవరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ నుంచి ప్రతిపాదనలు తెప్పించింది. క్షేత్రస్థాయి కమిటీల మదింపు మేరకు వచి్చన ఈ ప్రతిపాదనలపై థర్డ్ పార్టీ చేత కూడా పరిశీలన చేయించింది. అనంతరం థర్డ్‌పార్టీ కూడా ప్రభుత్వానికి అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. కానీ రాష్ట్రంలో రియల్ బూమ్ సరిగా లేని నేపథ్యంలో భూముల విలువలు సవరిస్తే ఆ రంగం మరింత దెబ్బతింటుందేమోననే ఆలోచనతో సవరణ ప్రతిపాదనను పక్కన పెట్టింది.
అయితే గత నెలలో మళ్లీ ఈ ఫైలును ప్రభుత్వం కదిలించింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఖచ్చితంగా పెరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భూముల విలువల సవరణ అనివార్యమని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో థర్డ్ పార్టీ నివేదికలను మళ్లీ క్షేత్రస్థాయికి పంపిన ప్రభుత్వం.. ఆదాయం ఎక్కువగా వచ్చే 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు కోరింది.
హైదరాబాద్, రంగారెడ్డి నుంచే ఎక్కువ ఆదాయం
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా వస్తుంటుంది. మొత్తం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60–70 శాతం ఆదాయం ఇక్కడినుంచే వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి (ఆర్‌వో), గండిపేట, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్, కూకట్‌పల్లి, వరంగల్, మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఎస్సార్‌నగర్, చంపాపేట, ఆజంపుర. నారపల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభనగర్, కీసర, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల సహా 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు అడిగినట్టు సమాచారం.
త్వరలోనే మంత్రి పొంగులేటి సమీక్ష
రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువల సవరణ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడెక్కడ, ఏమేరకు విలువలు పెంచాలనే అంశంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. థర్డ్‌పార్టీ నివేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అటు స్టాంపుల శాఖ, ఇటు థర్డ్‌పార్టీ నివేదికను మదింపు చేసిన మంత్రి.. తాజా ప్రతిపాదనల కోసం ప్రత్యేక ఫార్మాట్‌ను పంపినట్టు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందగానే స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భూముల విలువల సవరణ ఫైలును సీఎం ఆమోదానికి పంపుతారని, ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే సవరించిన భూముల విలువలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.